కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ పర్యటన రద్దయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ పర్యటన రద్దయింది. రేవంత్ సర్కార్ అమలు చేయనున్న గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్(200 యూనిట్లు) పథకాలను ప్రారంభించడానికి ప్రియాంక గాంధీ మంగళవారం చేవెళ్లకు వెళ్లాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
అయినప్పటికీ యథాతథంగా మంగళవారం వర్చువల్ మోడ్‌లో ఆ పథకాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఈ పథకాలను చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్ష మందికి పైగా హాజరయ్యే అంచనాతో చేవెళ్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ప్రియాంక గైర్హాజరైనప్పటికీ షెడ్యూల్ ప్రకారం బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలు పథకాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తారు.
ఈ పథకానికి ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా లబ్ధిదారులను గుర్తించామని, గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఈ ప్రయోజనాలకు అర్హులని ఆయన ఉద్ఘాటించారు. ప్రారంభ దశలో కవర్ చేయని వారు తమ సంబంధిత ప్రాంతాల్లోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని (MRO) సందర్శించి, వారి ఆధార్ , రేషన్ కార్డు వివరాలను సమర్పించి, లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి అభ్యర్థించవచ్చు. దరఖాస్తుదారులకు సహాయం అందించేందుకు MRO కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.