
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది విడిది (President Southern Sojourn) పర్యటన రద్దు అయింది. ప్రతి ఏడాది సంప్రదాయ ప్రకారం శీతకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు వస్తుంటారు. సికింద్రాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి బస చేస్తారు. ఐదారు రోజులు పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా రాష్ట్రపతి శీతకాల విడిది పర్యటన ఖరారు అయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) శీతకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. జనవరి 3వ తేదీ వరకు ఆరు రోజులు రాష్ట్రపతి కోవింద్ పర్యటన సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాట్లు చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులతో సమావేశమై.. అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.
అయితే తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది విడిది పర్యటన రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఆదివారం సమాచారం అందింది. అయితే కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలోనే రాష్ట్రపతి శీతకాల విడిది రద్దైనట్టుగా తెలుస్తోంది.