
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్‌లో పాల్గొన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్ల పరేడ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సమీక్షించారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఎయిర్ ఫోర్స్ అకాడమీ చరిత్రలో భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరుకావడం ఇదే మొదటిసారి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో పాటు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని తెలిపారు. టర్కీ భూకంప సహాయ చర్యల్లో కూడా భారత వాయుసేన బాగా పనిచేసిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా వాయుసేన అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. దేశంలోని రక్షణ దళాలు కలిసి భూ సరిహద్దులు, పెద్ద తీరప్రాంతం, ప్రాదేశిక జలాలు మరియు భారీ గగనతలాన్ని పరిరక్షిస్తున్నాయని గుర్తుచేశారు. . సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి రక్షణ సంసిద్ధత యొక్క సమగ్ర దృక్పథాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, చినూక్ హెవీ లిఫ్ట్ ఛాపర్‌లను ప్రవేశపెట్టడం ద్వారా భారత వైమానిక దళాన్ని ఆధునీకరించడం ఐఏఎఫ్ కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘సాయుధ దళాలు రక్షణ సంసిద్ధత సమగ్ర దృక్పథాన్ని గుర్తుంచుకోవాలి. మన వైమానిక దళం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటోందని, ముఖ్యంగా హై-టెక్నాలజీ యుద్ధంలో పోరాడే సవాళ్లతో సహా మొత్తం భద్రతా దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. 'ఆత్మనిర్భర్ భారత్' జాతీయ ఎజెండాను సాకారం చేయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ చేస్తున్న స్వదేశీ ప్రయత్నాల గురించి తెలుసుకుని నేను కూడా సంతోషిస్తున్నాను.
భారత వైమానిక దళం ఇప్పుడు అన్ని పాత్రలు, శాఖలలో మహిళా అధికారులను చేర్చుకోవడం నాకు సంతోషంగా ఉంది. మహిళా ఫైటర్ పైలట్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏప్రిల్ 2023లో నేను అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించాను. నేను వాయుసేన స్టేషన్‌కు తిరిగి వచ్చే ముందు దాదాపు 30 నిమిషాల పాటు బ్రహ్మపుత్ర, తేజ్‌పూర్ లోయలను హిమాలయాల యొక్క గొప్ప దృశ్యాన్ని కవర్ చేస్తూ ప్రయాణించాను. సముద్ర మట్టానికి సుమారు 2 కి.మీ ఎత్తులో గంటకు 800 కి.మీ వేగంతో ప్రయాణించడం నిజంగా గొప్ప అనుభవం’’ అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రి ఆమె అక్కడే బస చేశారు.