
టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం కొంగర కలాన్ లో ఆదివారం అట్టహాసంగా చేపట్టిన ప్రగతి నివేదిక సభ ముగిసింది. అయితే ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు వినియోగించిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ పేపర్స్, చెత్త సభాస్థలం వద్ద పేరుకుపోయాయి. అయితే వీటిని తమ పార్టీ కార్యకర్తలు, వాటంటీర్లు శుభ్రం చేస్తున్న కొన్ని పోటోలను ఐటీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలకు ఓ కామెంట్ జతచేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పర్యావరణానికి ముప్పు జరగకుండా సభను నిర్వహించుకుంటామని హైకోర్టుకు హామీ ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యర్థ పదార్థాలను సభ జరిగిన ప్రాంతం నుండి తరలిస్తున్నామని, కొంగర కలాన్ ప్రాంతంలో ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఏర్పడకుండా చూసుకుంటున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
భారీ ఎత్తున జరుగనున్న ఈ సభ ఏర్పాట్లు, తరలివచ్చే కార్యకర్తలు, ప్రజల కారణంగా పర్యావరణానికి హాని జరిగే అవకాశం ఉన్నట్లు అందువల్ల సభ జరక్కుండా చూడాలని కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభవల్ల ఎలాంటి పర్యావరణ నష్టం జరక్కుండా చూసుకుంటామని అధికార టీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రగతి నివేదన సభ ముగిసిన తర్వాత వ్యర్థాల తొలగింపు జరుగుతున్న విషయాన్ని కేటీఆర్ హైకోర్టు, ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.