ప్రగతినివేదన సభ అట్టర్ ప్లాప్: టీ-కాంగ్రెస్

By rajesh yFirst Published Sep 3, 2018, 12:46 PM IST
Highlights

 టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రగతి నివేదన సభకు రెండు లక్షలకు మించి ప్రజలు రాలేదన్నారు. సభకు 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ప్రజల నుంచి స్పందన కరువైందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. 
 

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రగతి నివేదన సభకు రెండు లక్షలకు మించి ప్రజలు రాలేదన్నారు. సభకు 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ప్రజల నుంచి స్పందన కరువైందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. 

సభలో మూడెకరాల భూ పంపిణీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని మండిపడ్డారు. మైనార్టీ రిజర్వేషన్‌పై ఢిల్లీలో భూ కంపం ఏమైందని నిలదీశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లు ఎందుకు మొక్కుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు సభ ఫెయిల్ అయింది కాబట్టి కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు.

ప్రగతి నివేదన సభలో హంగామా తప్ప ఏమీలేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రగతి నివేదన సభ ఉందని ఎద్దేవా చేశారు. మోదీ దగ్గర మోకరిల్లుతున్నది కేసీఆరే అని పొన్నం వ్యాఖ్యానించారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. 

విభజన హామీలు ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. దమ్ముంటే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేది కాంగ్రెస్‌ మాత్రమేనని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

 
ఓట్ల కోసమే కేసీఆర్ కొంగరకలాన్‌లో కొంగ జపం చేశారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్యయ్య విమర్శించారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ చేసిన ప్రగతే లేదని సభలో నివేదనా లేదన్నారు. విద్యుత్ గురించి గొప్పగా చెప్తున్న కేసీఆర్ ఒక్క మెగావాట్ విద్యుత్‌‌ను అయినా ఉత్పత్తి చేశారా, ఒక్క కొత్త ప్రాజెక్టునైన ప్రారంభించారా అని ప్రశ్నించారు. 

ఢిల్లీకి చెంచాగిరి చేస్తున్నది కేసీఆరే అని పొన్నాల దుయ్యబట్టారు. చెంచాగిరి చెయ్యకపోతే ఎందుకు పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని నిలదీశారు. ఎన్నికలకు కాంగ్రెస్ ఎప్పుడు భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికలు సమయానికి వస్తే ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ముందస్తు డ్రామాలు ఆడుతున్నారని పొన్నాల ఆరోపించారు.

click me!