పవన్‌వి పెయిడ్ కార్యక్రమాలు, రాజకీయాలకు వేస్ట్, నా పార్టీలోకి వచ్చేయొచ్చుగా : కేఏ పాల్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 15, 2023, 7:54 PM IST
Highlights

పవన్ కల్యాణ్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జీవో నెం.1ని ఏపీ హైకోర్ట్ సస్పెండ్ చేయడం పట్ల కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడన్నారు. పవన్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని  కేఏ పాల్ హితవు పలికారు. లేనిపక్షంలో తన పార్టీలోకి రావాలని పవన్‌కు ఆహ్వానం పంపారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1ని స్వాగతిస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. వైసీపీ నేతలు ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెడితే తాను అడ్డుకుంటాని ఆయన హెచ్చరించారు. అది ప్రాణాలు కాపాడే జీవో అని.. ఎప్పుడో రావాల్సిందన్నారు. అయితే జీవో నెం.1ని ఏపీ హైకోర్ట్ సస్పెండ్ చేయడం పట్ల కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు. 

ఇకపోతే... ఒంటరిగా వెళ్లిపోయి వీర మరణాలు అక్కర్లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒంటరి వుండి గెలుస్తానంటే తనకు ఎవరి పొత్తులు అక్కర్లేదన్నారు. మీరు అండగా వుంటానని గ్యారెంటీ ఇస్తారా అని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఓకే అని చెప్పి ఎన్నికలు అవ్వగానే మా వాడు, మా కులం అని అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తాను మిమ్మల్ని కుటుంబం అనుకున్నానని.. తన ఫ్యామిలీయే వదిలేస్తే తాను ఏం చేయాలని పవన్ ప్రశ్నించారు. కొన్నిసార్లు ప్రత్యర్ధులని కూడా కలుపుకునిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరినీ హింసించే ఒక్కడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలని పవన్ అన్నారు. గౌరవం తగ్గకుండా , మనం లొంగిపోకుండా కుదిరితే చేస్తాం.. లేదా ఒంటరిగానే వెళ్తామని పొత్తులపై ఆయన తేల్చేశారు. ఓడిపోతే ఇంట్లో కూర్చొన్నాం.. బయటికొచ్చాం తిరిగామని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయం ఎంత సేపటికీ రెడ్డి, కమ్మ, కాపు కులాల చుట్టూనే తిరుగుతున్నాయని.. ఇంకా ఎన్నో కులాలు వున్నాయని ఆయన తెలిపారు. 

ALso REad: ఒంటరిగా వెళ్లి వీరమరణాలొద్దు..కానీ కండీషన్స్ అప్లయ్, పొత్తులపై తేల్చేసిన పవన్ కల్యాణ్

ఇక, ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వంహెచ్చరించింది.

రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ప్రజల మేలు కోసమే తాము ఈ జీవో తీసుకోచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం జీవో నెంబర్‌ 1ను కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తీసుకొచ్చిందని మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. 

click me!