ప్రజా పాలన కార్యక్రమం నేటితో ముగుస్తున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోని వారిలో పలు రకాల ఆందోళనలు ఉన్నాయి.
Praja Palana: డిసెంబర్ 28వ తేదీన మొదలైన ప్రజా పాలన కార్యక్రమం నేటితో ముగుస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టింది. ప్రతి గ్రామానికి ఒక రోజు లేదా సెషన్ కేటాయిస్తూ అందరి నుంచీ దరఖాస్తులు తీసుకుంటున్నది. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ సాయంత్రానికి ముగుస్తున్నది. ప్రతి గ్రామం, పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పటికీ అనేక కారణాల రీత్యా పలువురు దరఖాస్తులు చేసుకోలేదు. వీరంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన కార్యక్రమాన్ని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రజా పాలన కార్యక్రమాన్ని పొడిగించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజా పాలన కార్యక్రమం పొడిగింపు లేదని స్పష్టమైపోయింది. అధికారులు మాత్రం ఆందోళన చెందవద్దని చెబుతున్నారు.
Also Read : Aditya L1: శనివారం ఫైనల్ ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్1.. సూర్యుడి రహస్యాలను అన్వేషించే ఇస్రో మిషన్
కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కార్యక్రమం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చేపడుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. మళ్లీ నాలుగు నెలలకు ప్రజా పాలన కార్యక్రమం ఉండనుంది. అయితే, త్వరలో పార్లమెంటు ఎన్నికలూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంటు ఎన్నికల వేళా ప్రజా పాలన కార్యక్రమం ఎలా సాగుతుందీ? అనే ఆందోళనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన కార్యక్రమం ముగిసినా స్థానిక మండల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వ ప్రకటనతో స్పష్టత రానుంది.