శనివారంతో ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. తదుపరిగా సోమవారం నుంచి తీసుకున్న దరఖాస్తుల వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి 28 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిసింది.
Praja Palana: ప్రజా పాలన శనివారానికి ముగిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీన ముగిసింది. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,08,94,115 దరఖాస్తులు అందాయి. చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు అందినట్టు అధికారుల నుంచి సమాచారం వస్తున్నది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమంలో సుమారు ఒక కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.
ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికంగా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిసింది. వీటితోపాటు రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు.
Also Read: Sankranthi Holidays: సంక్రాంతి సెలవుల వివరాలివే.. ఇంటర్ కాలేజీలకు నాలుగు రోజులు, స్కూళ్లకు..
ప్రజా పాలన ర్యక్రమంలో దరఖాస్తులు అన్నీ కూడా పేపర్ పై ఇచ్చినవే. ఆ దరఖాస్తుల వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేయాల్సి ఉన్నది. శనివారంతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో సోమవారం నుంచి ఈ డేటా ఎంట్రీ పని మొదలు కానుంది. ఇప్పటికే ఇందుకోసం శిక్షణ పూర్తయినట్టు తెలిసింది. పది రోజులపాటు డేటా ఎంట్రీ పని జరుగుతుంది. ఈ నెల 17వ తేదీతో డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత తదుపరి దశలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.