కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జయసుధ భేటీ.. బీజేపీలో చేరే అవకాశం..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలిశారు. అయితే జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Google News Follow Us

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉందని.. అందుకే కిషన్ రెడ్డితో సమావేశం అయిందని చెబుతున్నారు. ఇక, జయసుధ బీజేపీలో చేరనున్నట్టుగా గతంలో కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జయసుధతో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  సమావేశమై ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె బీజేపీ ముందు కొన్ని ముందస్తు షరతులు పెట్టడంతో.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నేతల ఆమోదం కోసం ఎదురుచూసినట్టుగా సమాచారం.

అయితే తాజాగా కిషన్ రెడ్డితో జయసుధ భేటీ కావడంతో ఆమె బీజేపీలో చేరిక ఖాయమనే ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే, తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, డీకే అరుణ ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా.. ఈటల రాజేందర్ కూడా ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. 

ఇక, జయసుధ విషయాని వస్తే అనేక చిత్రాలలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలు పోషించారు. కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి  తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ విజయం సాధించలేకపోయారు. ఇక, జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ చాలా వరకు ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ప్రస్తుతం జయసుధ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగానే ఉన్నారు. 

Read more Articles on