
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. తాజాగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమర్కను నల్గొండ జిల్లాలో కలిశారు. కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలోని వీరిద్దరు భేటీ అయ్యారు. మండుటెండలో పాదయాత్ర కొనసాగించిన భట్టి విక్రమార్క వడదెబ్బతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క్‌ను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిక సంబంధించి మల్లుభట్టి విక్రమార్కతో పొంగులేటి చర్చించారు.
సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటి.. ఇద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైన భట్టి, పొంగులేటి మధ్య చర్చ జరిగింది. త్వరలో ఖమ్మంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసే సభను సక్సెస్ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలో కూడా వీరు చర్చించుకున్నట్టుగా సమాచారం.
అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టడం అభినందనీయం అని అన్నారు. అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలసుకుంటూ భట్టి ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఆయనను పరామర్శించేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు.
ప్రజలు కలలు కన్న తెలంగాణ.. కాంగ్రెస్ తోనే సాధ్యం అని పేర్కొన్నారు. తాను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్ లోకి రావట్లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టంచేశారు. కేసీఆర్ ను గద్దె దించదానికి ఎన్ని మెట్లు దిగడానికైన సిద్ధమేనని అన్నారు.
మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ పాలనలో దోపిడీకి గురవుతుందని విమర్శించారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. పొంగులేటిని మనస్పూర్తిగా కాంగ్రెస్‌లోని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు.