
మంచిర్యాల : అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ నవ్య వేధింపుల ఆరోపణలు, హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే మహిళా కార్పోరేటర్ కు ఫోన్ చేసి వేధింపులు, బోధన్ చిన్నారిపై బిఆర్ఎస్ నాయకుడి అత్యాచారం ఘటనలు మరిచిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల యూత్ ప్రెసిడెంట్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా బింగి ప్రవీణ్ కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల ఇతడి ఇంటి సమీపంలోనే నివాసముండే భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆ దంపతుల పంచాయితీ ప్రవీణ్ వద్దకు చేరింది. భార్యాభర్తలకు సర్దిచెప్పి కలపాల్సింది పోయి వివాహితపై కన్నేసి వేధింపులకు దిగాడు.
తనకు ప్రవీణ్ అర్థరాత్రి వరకు వాట్సాప్ మెసేజ్ లు పంపిస్తున్నాడని... వీడియో కాల్స్ చేసి మాట్లాడాలని వేధిస్తున్నాడని వివాహిత ఆరోపించింది. దీంతో అతడిపై పోలీసులు ఫిర్యాదుచేసినా అధికార పార్టీ నాయకుడు కాబట్టి వారుకూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధిత మహిళ తెలిపింది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని... చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారని వివాహిత పేర్కొంది.
Read More ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ సర్పంచ్ నవ్య : వేధింపుల కేసులో కీలక ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు...
వివాహిత తనపై చేసిన ఆరోపణలపై ప్రవీణ్ స్పందించాడు. గొడవపడి తనవద్దకు వచ్చిన దంపతులకు సాయం చేయడానికే ప్రయత్నించానని... కానీ ఆమె ఎందుకు తనపై వేధిస్తున్నానని ఆరోపిస్తోందో అర్థంకావడం లేదన్నారు. ఆమెను తాను వేధించలేదని ప్రవీణ్ తెలిపాడు.
ఇదిలావుంటే నిజామాబాద్ జిల్లా బోధన్ లో 13ఏళ్ళ మైనర్ పై బిఆర్ఎస్ నాయకుడు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. బోధన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ సోదరుడు రవి మైనర్ బాలికపై కన్నేసాడు. ఈ క్రమంలో ఇటీవల బాలిక ఒంటరిగా ఇంట్లోంచి బయటకు రావడం గమనించిన అతడు బోధన్ బలవంతంగా ఓ షెడ్డులోకి లాక్కెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎదురుతిరగకుండా కాళ్లు చేతులు కట్టేసి, అరవకుండా నోట్లు గుడ్డలు కుక్కి అత్యంత పాశవికంగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కూతురిపై జరిగిన లైంగిక దాడి గురించి తెలియడంతో ఆ తల్లి స్థానిక మైనార్టీ నాయకులను ఆశ్రయించింది. నిందితుడితో పాటు అతడి సోదరుడు రాధాకృష్ణ కూడా ఘటన గురించి ఎవరికి చెప్పొద్దని బెదిరించారని స్థానికులు ఆరోపించారు.ఈ నేపథ్యంలో నిందితుడితో పాటు రాధాకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిండితుడైన రవి మీద ఫోక్సో చట్టం, అత్యాచారాల నేరాల కింద కేసులు నమోదు చేశారు. అతని సోదరుడైన బిఆర్ఎస్ నేత రాధాకృష్ణ మీద కూడా బెదిరింపులకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు.