నా రాజకీయం అంతా ఢిల్లీలోనే..: పొంగులేటితో భేటీ అనంతరం రేణుకా చౌదరి

Published : Jun 26, 2023, 12:44 PM ISTUpdated : Jun 26, 2023, 01:19 PM IST
 నా రాజకీయం అంతా ఢిల్లీలోనే..: పొంగులేటితో భేటీ అనంతరం రేణుకా చౌదరి

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా  చౌదరితో భేటీ అయ్యారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్ నెలకొంది. మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులతో పాటు మరికొందరు నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ‌తో భేటీ కానున్నారు. ఓవైపు కాంగ్రెస్‌లో నేతల చేరికల నేపథ్యంలో.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పార్టీ కోసం కష్టపడుతున్నవారి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా పార్టీ అధిష్టానం పావులు కదుపుతుంది. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలోని కొందరు కాంగ్రెస్ నేతలు పొంగులేటి చేరికను వ్యతిరేకిస్తున్న సంగతి  తెలిసిందే. అందులో రేణుకా చౌదరి వర్గం కూడా ఉందనే ప్రచారం సాగుతుంది. 

అయితే ఈ క్రమంలోనే నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు ఢిల్లీలో రేణుకా చౌదరితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. వీరు ఉమ్మడి ఖమ్మంలో కలిసి  పనిచేయడంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. రానున్న తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నేతల మధ్య సమన్వయం కోసం ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెబుతున్నారు.

ఈ భేటీకి సంబంధించి ఇరువురు నేతలు కూడా వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లోకి రాబోతున్నట్టుగా రేణుకా చౌదరికి చెప్పడం జరిగిందని పొంగులేటి చెప్పారు. ప్రత్యేకంగా రాజకీయాలు ఏం మాట్లాడలేదని తెలిపారు. మరోవైపు రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అధిష్టానం అంగీకరించిన వాళ్లందరూ పార్టీలోకి వస్తారని అన్నారు. తన రాజకీయం అంతా ఢిల్లీలోనే చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదుగా అని ప్రశ్నించారు. పొంగులేటి ఏ డిమాండ్ చేయలేదని చెప్పారు. ఆయన ఇంకా అధికారికంగా పార్టీలో చేరలేదని.. అప్పుడు సీట్లు మట్లాడేసుకున్నారని అనడం సరికాదని అన్నారు. బీజేపీలో ఉన్న తెలంగాణ  నేతలు నరకం చూస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఆశ్చర్యపోయే చేరికలు ఉంటాయని తెలిపారు. ఏదైనా అధిష్టానం డిసైడ్ చేస్తుందని.. తమకు ఇష్టమున్నా, కష్టమున్నా దానిని పాటిస్తామని అన్నారు. 

ఈ క్రమంలోనే మీడియాతో అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ.. ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈటల వస్తే బాగానే ఉంటుందని అన్నారు. 
బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆరోపించారు. బీజేపీలో కోవర్టులు  లేరా? అని ప్రశ్నించారు. బీజేపీలో కోవర్టుల సంగతి తనను అడిగితే చెబుతానని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఇంటి వ్యవహారం అని అన్నారు. కాంగ్రెస్‌లో టికెట్ ఆశించేవాళ్లు ఆకాశమంతా మంది  ఉంటారని చెప్పారు. దక్షిణాదిలో బీజేపీకి అవకాశం లేదని అన్నారు. సౌత్ సెంటిమెంట్ మోదీ, అమిత్ షాలకు అర్థం కాలేదని చెప్పారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ దుర్మార్గపు రాజకీయమని విమర్శించారు. 

ఇక, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పీపుల్స్ మార్చ్‌ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమర్కను నల్గొండ జిల్లాలో కలిశారు. కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలోని వీరిద్దరు భేటీ అయ్యారు. మండుటెండలో పాదయాత్ర కొనసాగించిన భట్టి విక్రమార్క వడదెబ్బతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క్‌ను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిక సంబంధించి మల్లుభట్టి విక్రమార్క‌తో పొంగులేటి చర్చించారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?