
జూలై 2న ఖమ్మంలో జరిగే జన గర్జన సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సభకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందని ఆరోపించారు.
జన గర్జన సభకు బస్సులు అందనివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సభలు, సమావేశాలకు ఒక చలానా కట్టి .. దానిపై నాలుగు బస్సులను తీసుకుంటారని పొంగులేటి ఆరోపించారు. నష్టాల్లో వున్న ఆర్టీసీని మా వంతుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో .. వందలాది బస్సులను సభకు అడిగామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 1500 బస్సులు అడిగితే ఇస్తామన్న అధికారులు.. తెల్లారేసరికి మాట మార్చారని మండిపడ్డారు.
తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ బిడ్డ వస్తుంటే ఇదా గౌరవించే పద్ధతి అంటూ పొంగులేటి ఫైర్ అయ్యారు. జన గర్జన సభ జరిగే ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో చెక్ పోస్టులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వాహనాల్లో సభకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. అయినా చెక్ పోస్టులు పెట్టి వాహనాల్లో వచ్చే వారిని ఆపడానికి వారేమి టెర్రరిస్టులు, నక్సలైట్లు, దోపిడి దొంగలు కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం వచ్చే వారికి తాను అండగా వుంటానని పొంగులేటి పేర్కొన్నారు.
ప్రభుత్వం పాచికలు పారకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నీచాతి నీచమైన ఆలోచన చేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం నీళ్లు ఇవ్వకుండా.. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సభ జరిగే సమయంలో నీళ్లు ఇస్తామని ప్రకటించారని ఇంతకన్నా దారుణం వుంటుందా అని ఆయన ప్రశ్నించారు. గోడకు బంతిని ఎంత గట్టిగా కొడితే.. అంతే స్పీడ్‌గా రివర్స్ వస్తుందన్నట్లు తాము కూడా అదే స్థాయిలో కెరటంలా దూసుకొస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.
ఆర్టీసీ.. కేసీఆర్ తాతది కాదు, పువ్వాడ తండ్రిది కాదని శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించిన సభను నిర్వహిస్తామని పొంగులేటి పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. తన చేరిక తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‌ల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వలసలు వుంటాయని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చేరికతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో అసంతృప్తి వుందని పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.