వీడెవడో మామూలు తాగుబోతులా లేడు. తాగిన మైకంలో ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లాడట. ఈ ఘటన గద్వాల జిల్లాలో వెలుగుచూసింది.
గద్వాల : ఏదయినా దొంగతనం జరిగితే మనం వెంటనే పోలీసులను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే దొంగతనానికి గురయితే... ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగుచూసింది. ఓ తాగుబోతు మద్యంమత్తులో ఏకంగా పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిపోయాడు.
వివరాల్లోకి వెళితే... గద్వాల జిల్లా ఇటిక్యాల పోలీస్ స్టేషన్ సిబ్బంది రోజూ మాదిరిగానే జాతీయ రహదారిపై పెట్రోలింగ్ కు వెళ్లారు. హైవేపై వాహనాల రద్దీ అధికంగా వుండటంతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టేందుకు సిద్దమయ్యారు. వెంటనే పోలీస్ వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపి ట్రాఫిక్ ను కంట్రోల్ చేయసాగారు. ఇలా పోలీసులు తమ పనిలో బిజిగా వుండగా ఓ తాగుబోతు మరో పనిలో బిజీ అయిపోయాడు.
తాగిన మైకంలో చేసాడో లేక కావాలనే చేసాడో తెలీదుగానీ ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్ళాడు తాగుబోతు యువకుడు. పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ లో నిమగ్నమై వుండటంతో తమ వాహనం మాయమైన విషయాన్ని గుర్తించలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చిచూడగా వాహనం కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయి వారు గాలింపు చేపట్టారు.
అయితే ముమ్మర తనిఖీల తర్వాత ఎట్టకేలకు పోలీస్ వెహికిల్ జాడ తెలిసింది. కోదండపురం పెట్రోల్ బంక్ వద్ద పోలీస్ వాహనాన్ని విడిచిపెట్టి వెళ్లాడు సదరు తాగుబోతు దొంగ. తమ వాహనాన్ని గుర్తించినా దాన్ని తీసుకెళ్లలేని సంకట పరిస్థితి పోలీసులకు ఎదురయ్యింది. ఎందుకంటే వాహనం వుందికానీ కీ లేదు... దాన్ని తనవెంట తీసుకెళ్లినట్లున్నాడు తాగుబోతు. ఎలాగోలా వాహనాన్ని స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.
తమ వెహికిల్ దొంగతనం వ్యవహారాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. వారి ఆదేశాల మేరకు దొంగిలించిన తాగుబోతును గుర్తించేందుకు గద్వాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.