ప్రజా సంగ్రామ యాత్ర : జగిత్యాలలో బండి సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Nov 27, 2022, 9:15 PM IST
Highlights

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జగిత్యాల వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం భైంసా వెళ్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం జగిత్యాల వద్ద ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని బండి సంజయ్ తెలిపారు. రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బైంసా సున్నిత ప్రాంతం అంటున్నారని, అదేమైనా నిషేధిత ప్రాంతమా.. అక్కడికి ఎందుకు పోవద్దని బండి సంజయ్ నిలదీశారు. బైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని... పోలీసుల రిక్వెస్ట్ మేరకు తాను ప్రస్తుతానికి కరీంనగర్ పోతున్నానని బండి సంజయ్ అన్నారు. రేపు మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉందని.. అప్పటివరకు వెయిట్ చేస్తామని అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం కావాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబ్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా అని ఆయన నిలదీశారు. 

ALso REad:ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్‌కి షాక్.. భైంసాలో పాదయాత్రకు నో పర్మిషన్

కాగా.. రేపటి నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర సాగుతుందని బీజేపీ శ్రేణులు తేల్చిచెబుతున్నాయి. 

 

click me!