ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసు సోదాలు

By telugu teamFirst Published Jan 18, 2020, 7:48 AM IST
Highlights

ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాశీం నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.. ఆయన ఓయు క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఆయన విరసం కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కాశీం నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. 

ప్రొఫెసర్ కాశీం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో పని చేస్తున్నారు. ఆయన ఇటీవలీ విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. కాశీం ఇంట్లో గజ్వెల్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు శనివారం సాయంత్రం వరకు కొనసాగవచ్చునని భావిస్తున్నారు.

2016లో కాశీంపై నమోదైన కేసు విషయంలో తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాశీంను అరెస్టు చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సెర్చ్ వారంట్ తో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిద్ధిపేట, ములుగు కేసుల్లో కాశీం తొలి ముద్దాయిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి మావోయిస్టు పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీపీ నారాయణ నేతృత్వంలో కాశీ నివాసంలో పోలీసులు సోదాలను నిర్వహిస్తున్నారు. గజ్వెల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

click me!