హైద్రాబాద్ సరూర్‌నగర్ గ్రూప్-4 పరీక్షా కేంద్రంలోకి ఫోన్: అభ్యర్ధిపై కేసు నమోదు

By narsimha lode  |  First Published Jul 1, 2023, 2:27 PM IST

హైద్రాబాద్ సరూర్ నగర్  మండలం మారుతీనగర్ లో  పరీక్ష కేంద్రంలో  సెల్ ఫోన్ తో  వచ్చిన  అభ్యర్ధిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. 


హైదరాబాద్: నగరంలోని సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లో గల పరీక్ష  కేంద్రంలోకి  సెల్ ఫోన్ తో  వచ్చిన  అభ్యర్ధిపై   కేసు నమోదు  చేశారు  పోలీసులు. తెలంగాణలో గ్రూప్-4  పరీక్ష ఇవాళ ఉదయం  పది గంటలకు  ప్రారంభమైంది.  రెండు విడతలుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం పేపర్-1  పరీక్షకు  హాజరైన  అభ్యర్ధి  సెల్ ఫోన్ తో పరీక్ష కేంద్రంలోకి  వచ్చారు. పరీక్ష ప్రారంభమైన  అరగంట  తర్వాత ఇన్విజిలేటర్  ఈ విషయాన్ని గుర్తించాడు. వెంటనే  సమాచారాన్ని ఉన్నతాధికారులకు  చేరవేశాడు.  పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్ధి నుండి  ఫోన్ ను సీజ్ చేశారు.

also read:ప్రారంభమైన తెలంగాణ గ్రూప్-4 పరీక్ష: ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులకు అనుమతి నిరాకరణ

Latest Videos

మరో వైపు  అభ్యర్ధిపై  మాల్ ప్రాక్టీస్  కింద  కేసు నమోదు  చేశారు.   సెల్ ఫోన్ తో  అభ్యర్ధి పరీక్ష కేంద్రంలోకి ఎలా వచ్చారనే  విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతించే సమయంలో  క్షుణ్ణంగా తనిఖీ  చేస్తారు.  తనిఖీల సమయంలో  సెల్ ఫోన్ ను  ఎందుకు గుర్తించలేకపోయారనే విషయమై పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమయ్యే  పేపర్ -2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులను మరింత క్షుణ్ణంగా  తనిఖీలు  చేసిన తర్వాత  పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు అధికారులు.

గ్రూప్ -4  ద్వారా  రాష్ట్రంలోని  8, 180 ప్రభుత్వ ఉద్యోగాలను  భర్తీ చేయనుంది ప్రభుత్వం.  గ్రూప్-4 పరీక్షకు  పకడ్బందీ  ఏర్పాట్లు  చేసింది టీఎస్‌పీఎస్‌సీ. పరీక్ష కేంద్రంలోకి రెండు గంటల ముందే అభ్యర్ధులను అనుమతించారు.  మరో వైపు  ఎలక్ట్రానిక్ వస్తువులు, బెల్ట్,  షూలు అనుమతించలేదు.  మరో వైపు  పరీక్షకు  15 నిమిషాల ముందే  పరీక్ష కేంద్రం గేట్లు మూసివేశారు. అయితే  సుదూర ప్రాంతాల నుండి పరీక్ష కేంద్రాలకు  రావడానికి  ఆలస్యమైందని కొందరు అభ్యర్ధులు ఆవేదన చెందారు.హైద్రాబాద్  లోని నిజాం కాలేజీ   పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులు  తమను పరీక్ష రాసేందుకు అనుమతించాలని  ఆందోళన చేశారు.

click me!