ఎఎస్ఐ మోహన్ రెడ్డిని సర్వీస్ నుండి పోలీస్ శాఖ తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వడ్డీల పేరుతో పలువురిని మోసం చేశారని మోహన్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
కరీంనగర్: సస్పెన్షన్ కు గురైన ఎఎస్ఐ మోహన్ రెడ్డిని సర్వీస్ నుండి పోలీస్ శాఖ తప్పించింది. వందలాది మందిని ఎఎస్ఐ మోహన్ రెడ్డి మోసం చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే. చిట్టీల పేరుతో అధిక వసూళ్లకు పాల్పడినట్టుగా మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. కొందరు మోహన్ రెడ్డి బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు.
కరీంనగర్ క్రైం బ్రాంచ్ లో ఎఎస్ఐ గా మోహన్ రెడ్డి విదులు నిర్వహించాడు. మోహన్ రెడ్డి నిర్వహించిన వడ్డీ వ్యాపారంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులకు కూడా పెట్టుబడులున్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎఎస్ఐ మోహన్ రెడ్డి వేధింపులు భరించలేక ప్రసాదరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాదరావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్ రెడ్డి వ్యవహరం బయటకు వచ్చింది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. దీంతో పలువురు బాధితులు సీఐడీకి ఫిర్యాదులు చేశారు. మోహన్ రెడ్డికి వందల కోట్ల ఆస్తులున్నట్టుగా విచారణ బృందం గుర్తించింది. ఈ కేసు బయటకు రావడంతో ఎఎస్ఐగా ఉన్న మోహన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మోహన్ రెడ్డిపై స్థానిక పోలీసులతో పాటు సీఐడీ, ఏసీబీ సుమారు 12 కేసులు నమోదు చేసింది.