సరుకులు కొనడానికి వచ్చి రూ.10లక్షల చోరీ..!

By telugu news teamFirst Published Oct 9, 2021, 7:29 AM IST
Highlights

భార్యను దుకాణంలో ఉంచి భర్త భోం చేయడానికి ఇంటికి వెళ్లారు.  ఓ దుండగుడు ద్విచక్ర వాహనంపై దుకాణానికి వచ్చి నూనె ప్యాకెట్ కొన్నాడు. 

సరుకులు కొంటానని నమ్మించి ఓ వ్యక్తి కిరాణ దుకాణంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత  దొంగతనానికి పాల్పడ్డాడు. దుకాణ  యజమాని సరుకులు ఇచ్చే పనిలో ఉండగా కౌంటర్ వద్ద బ్యాగులో ఉంచిన రూ.10లక్షలు పైగా నగదు అపహరించాడు. హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన బోయిని కనకతార ఐకేపీలో సీఏగా, బ్యాంకు మిత్రగా పనిచేస్తున్నారు. మరో మహిళతో కలసి వస్త్ర సంచుల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. కనకతార భర్త ఎల్లయ్య పోతారం ప్రధాన రహదారిపై కిరాణ దుకాణం నడిపిస్తున్నారు. తమ పరిశ్రమ,  సంఘం సంబంధించి డబ్బును చేతి సంచిలో వేసుకొని కిరాణ దుకాణం కౌంటర్ వద్ద పెట్టారు.

భార్యను దుకాణంలో ఉంచి భర్త భోం చేయడానికి ఇంటికి వెళ్లారు.  ఓ దుండగుడు ద్విచక్ర వాహనంపై దుకాణానికి వచ్చి నూనె ప్యాకెట్ కొన్నాడు.  రూ.2వేలు నోటు ఇవ్వడంతో చిల్లరను ఆమె చేతి సంచి నుంచి తీసివచ్చారు. అందులో భారీగా ఉన్న డబ్బు దుండగుడికి కనిపించింది. అక్కడే మరే వ్యక్తి లేకపోవడంతో కొట్టేయాలనుకున్నాడు.

నూనె ప్యాకెట్ తన ద్విచక్ర వాహనంలో పెట్టుకొని తిరిగి దుకాణానికి వచ్చి ఉల్లిపాయలు కావాలని అడిగాడు. అవి కౌంటర్ కి దూరంగా ఉండటంతో ఆమె అవి తేవడానికి వెళ్లారు. ఈ క్రమంలో డబ్బుల బ్యాగును తీసుకొని ఉడాయించాడు. అతను వెళ్లిన కాసేపటి తర్వాత డబ్బుల బ్యాగు కనిపించడం లేదని ఆమె గుర్తించింది.

లబోదిబోమంటూ రోడ్డుపైకి వచ్చి వెతికినా దుండగుడు కనిపించలేదు. వస్త్ర సంచుల పరిశ్రమని రూ.5లక్షలు , సంఘాలవి రూ.3లక్షలతోపాటు ఇతర నగదు పోయిందని చెబుతున్నారు.  పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!