
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసు కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన బండి సంజయ్ పై కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా.. ఆయనతోపాటు మరో 20 మంది పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 21 మందిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కి కూడా తరలించారు.
రిమాండ్‌కు తరలించిన వారిలో ఏ1 గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, ఏ2 వేలంగి రాజు, ఏ8 పత్తిపాటి విజయ్, ఏ13 సాయిమణికంఠ, ఏ17 బండారు నాగరాజు, ఏ18 తోట శేషు ఉన్నారు.
ఆస్తి ధ్వంసం, ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరచడం, మూకుమ్మడిగా దాడి, అక్రమ ప్రవేశం వంటి అంశాలకు సంబంధించి వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. గుర్రంబోడు ఘటనలో పోలీసులకు గాయాలైన విషయం విధితమే. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఇతర మార్గాల్లో వచ్చిన సమాచారం ద్వారా దాడిలో ఎవరెవరు పాల్గొన్నారని పోలీసులు ఆరా తీసి.. కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు గిరిజనులకు భరోసా ఇవ్వడానికి హుజూర్‌నగర్ గుర్రంబోడు తండాకు వెళ్లిన తనతో పాటు 25 మందిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.