గోల్డ్ లోన్ పేరిట పనిచేస్తున్న కంపెనీకే టోకరా.. రూ.30లక్షలు స్వాహా

By telugu news teamFirst Published Jul 13, 2021, 8:12 AM IST
Highlights

తాను హెడ్‌ ఆఫీస్‌ నుంచి మేనేజర్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకుని, తమ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు డోర్‌స్టెప్‌ గోల్డ్‌లోన్‌ పథకంలో డబ్బు ఇవ్వాలని కోరాడు. 

అన్నం  పెడుతున్న కంపెనీనే  నిండా ముంచేయాలని చూశారు. కంపెనీలో అవకతవకలు సృష్టించి.. ఏకంగా రూ.30లక్షలు కాజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ అవకతవకలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10లక్షల సొమ్మును కూడా జప్తు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన ఆదిత్య నారాయణ్‌ మహాపాత్ర(22) ఓ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థ అందించే గోల్డ్‌లోన్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌ పథకం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. తమ ప్రాంతానికే చెందిన లక్ష్మీధర్‌ ముర్ము(21), ప్రమోద్‌ నాయక్‌(23), సౌమ్యారంజన్‌ పాట్నిక్‌(21), దేబాషిష్‌ ఓఝా(20)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. నకిలీ ధృవపత్రాలు రూపొందించి ఆ సంస్థ హిమాయత్‌నగర్‌ శాఖ మేనేజర్‌కు ఫోన్‌ చేశాడు. తాను హెడ్‌ ఆఫీస్‌ నుంచి మేనేజర్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకుని, తమ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు డోర్‌స్టెప్‌ గోల్డ్‌లోన్‌ పథకంలో డబ్బు ఇవ్వాలని కోరాడు. 

దీనికి బ్యాంక్‌ మేనేజర్‌ అంగీకరించాడు. అలాగే హెడ్‌ ఆఫీ్‌సకు సైతం ఫోన్‌ చేసి హిమాయత్‌నగర్‌ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు డోర్‌స్టెప్‌ గోల్డ్‌లోన్‌ కోసం అప్రూవల్‌ ఇవ్వాలని కోరారు. ఆ మేరకు దరఖాస్తు పత్రాలను మార్పిడి చేసి హెడ్‌ ఆఫీ్‌సలో లోన్‌ అప్రూవల్‌ పొందాడు. అనంతరం వీరందరూ ఎలాంటి బంగారం తాకట్టు పెట్టకుండా రూ.30 లక్షల రుణం తీసుకున్నారు. శాఖ అంతర్గత విచారణలో విషయం బయటికి పొక్కడంతో హిమాయత్‌నగర్‌ శాఖ మేనేజర్‌ సీసీఎస్‌లో గతనెలలో ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారి ఖాతాలో లోన్‌ తీసుకున్న మొత్తంలో మిగిలిన రూ.10 లక్షలను ఫ్రీజ్‌ చేయించారు. వారి నుంచి 69 మొబైల్‌ ఫోన్లు, డెబిట్‌కార్డు, పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

click me!