తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎర్రవెల్లికి వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయలుదేరేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఎర్రవెల్లికి వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయలుదేరేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తుతో పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకన్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.దాదాపు 15 నిమిషాల పాటు రేవంత్ ఇంటి బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారీగా హోహరించిన పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు, ఇతర కారణాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో తలపెట్టిన రచ్చబండకు పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎన్ని నిర్బంధాలు ఎదురైన ఎర్రవెల్లికి వెళ్లి తీరుతానని వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పోలీసులు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి వరి కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి కుట్రలో భాగంగానే తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారని.. నేడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు.