
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ సత్యాగ్రహ దీక్షలో ప్రజాగాయకుడు గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రావడంలో సోనియా గాంధీ చారిత్రాత్మక పాత్ర పోషించారని అన్నారు. సోనియా గాంధీని ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు చాలా కీలకమని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లి సోనియా గాంధీ గురించి చెప్పాలన్నారు. సోనియాకి కష్టం వచ్చిందని పల్లెపల్లెకి వెళ్లి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పా మనకి వేరే మార్గమే లేదని గద్దర్ అన్నారు.
అయితే గద్దర్ ఇప్పుడు గాంధీ భవన్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సభకు కూడా గద్దర్ హాజరయ్యారు. వీఐపీ పాస్‌తో ఆయన సమావేశానికి హాజరయ్యారు. దేశం, తెలంగాణపై ప్రధాని ఏం మాట్లాడుతున్నారో వినేందుకు వచ్చానని గద్దర్ అన్నారు. Vijaya Sankalpa Sabhaలో పాల్గొనాలని బీజేపీ నేతలు ఆహ్వానించి పాస్ కూడా అందించారని గద్దర్ మీడియాకు చెప్పారు. ఈ కారణంగానే తాను ఈ సభకు హాజరయ్యాయని ఆయన చెప్పారు. అంతకుముందు తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు గద్దర్ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన సంగతి తెలిసిందే.