
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవకాశం వచ్చినప్పుడల్లా కడుపులోని విషం కక్కుతున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ మీద విషం చిమ్ముతున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ సంబురాలు చేసుకోలేదని కపట మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో సంబురాలు చేసుకోలేదని అనడం కంటే అన్యాయం ఇంకొకటి ఉండదని తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో ఊరూ, వాడా సంబురం చేసుకుందని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదిగిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక్కడి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమవుతున్నాయని వివరించారు. రూ. 200 పింఛన్‌ను రూ. 2000కు పెంచామని, ఎకరానికి రూ. 10 వేల రైతు బంధు అందిస్తున్నామని చెప్పారు. వేరుపడ్డ తొలి రోజుల్లోనే ఏడు మండలాలను ఏపీలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారని, పండుగ చేసుకున్నారని మంత్రి హరీశ్ రావు వివరించారు. కానీ, మోడీ మాత్రం పండుగ చేసుకోలేదని విషం కక్కుతున్నాడని విమర్శలు గుప్పించారు. జాతీయ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? అవన్నీ అబద్ధాలేనని ఎత్తిచూపారు. యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కనీసం 2 లక్షలు కూడా ఇవ్వలేదని వివరించారు. అలాంటి వాళ్లు తెలంగాణపై విషం చిమ్మడం మానాలని హితవుపలికారు. ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
Also Read: మేం భారత్‌ను రెచ్చగొట్టడం లేదు.. కానీ, సమాధానాలు కావాలి: కెనడా ప్రధాని ట్రూడో
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్‌లో డబుల్ లేనింగ్ రోడ్డు, గజేంద్ర భారతి మహారాజ్ సహా పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అలాగే, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం, ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌లని మాయమాటలు చెబుతున్నదని, అవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవెందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.