Vijaya Sankalpa Sabha: బండి సంజయ్ ఏర్పాట్లు సూపర్... భుజం తట్టి అభినందించిన మోడీ..!

By Mahesh KFirst Published Jul 3, 2022, 7:23 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పలుమార్లు అభినందించారు. ఏర్పాట్లు బాగున్నాయని బండి సంజయ్‌ను ప్రశంసించారు. పరేడ్ గ్రౌండ్‌లో బండి సంజయ్ ప్రసంగించిన తర్వాత కూడా ఆయన భుజాన్ని పలుమార్లు తడుతూ అభినందించారు.
 

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అభినందించారు. సమావేశాల కోసం ఏర్పాట్లు సూపర్ అని బండి సంజయ్‌ను ప్రశంసించారు. ఈ రోజు పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ బండి సంజయ్‌ను రెండు సార్లు అభినందించాడు.

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభ వేదిక ఎక్కిన తర్వాత ప్రధాన మంత్రి ఏర్పాట్లను చూశారు. సభకు హాజరైన ప్రజలను చూసి సంతోషపడ్డట్టు తెలిసింది. అనంతరం బండి సంజయ్‌తో ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించాడు. ఆ తర్వాత బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బండి సంజయ్ ప్రసంగం ముగిసిన తర్వాత కూడా ప్రధాని మోడీ ఆయన భుజాన్ని పలుమార్లు తడుతూ అభినందించాడు.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నప్పుడూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆయనను అభినందించారు. మే నెలలో బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్ చేసి శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు అని ప్రశంసించారు. అదే విధంగా అప్పుడు నిర్వహించిన తుక్కుగూడ సభ విజయవంతం కావడంపైనా మాట్లాడినట్టు సమాచారం.

ఇదిలాా ఉండగా ఇదే వేదికపై కేంద్ర మంత్రి అమిత్ షాా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాన్ని సాధించామా అని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యిందా అని అమిత్ షా నిలదీశారు. కేసీఆర్.. నా మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకో ... నీది కాదు, నీ కొడుకుది కాదు.. వచ్చేసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

తన కొడుకు ను సీఎం చేయడానికే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ పార్టీ గుర్తు అయిన కారు స్టీరింగ్ .. ఓ వై సీ చేతుల్లో వుందని ఆయన ఎద్దేవా చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ భారత్ లో భాగం అయ్యేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు అధికారికంగా జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓవైసీకి భయపడే విమోచనం దినాన్ని కేసీఆర్ జరపడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు. 

తాము అధికారంలోకి వస్తే.. ఎవరికీ భయపడకుండా విమోచన దినం జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఇక సచివాలయానికి వెళ్లక్కర్లేదంటూ అమిత్ షా సెటైర్లు వేశారు. వచ్చేసారి సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని ఆయన జోస్యం చెప్పారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమిస్తోందని అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అమిత్ షా కోరారు. 

click me!