
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో Tandur టీఆర్ఎస్ టికెట్ తనదేనని ఎమ్మెల్యే పైలెట్ Rohith Reddy ధీమాను వ్యక్తం చేశారు. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పారు.ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు. తనకు ఎమ్మెల్సీ Mahender Reddy పోటీయే కాదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తో గురువారం నాడు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ రాదనే నిరాశా నిస్పృహలతోనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం ఇటీవల కాలంలో నిర్వహించిన సర్వేల్లో ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా ఉందని రోహిత్ రెడ్డి చెప్పారు. 2018 నుండి తాను తాండూరు ప్రజలకు చేసిన సేవతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే వివరించారు. మహేందర్ రెడ్డి తీరుతో విసిగిపోయిన ప్రజలు 2018లో తనను గెలిపించారని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు.
కరోనా సమయంలో కూడా తాను ప్రజలకు అండగా నిలిచానన్నారు. పార్టీ అధిష్టానానికి గెలుపు గుర్రాలు అవసరమన్నారు. తాను గెలుపు గుర్రమని రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేసులో తాను గెలుపు గుర్రమని తెలిసి పార్టీ నాయకత్వం ఎందుకు తనకు టికెట్ ఇవ్వదని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభినందించారని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు.
తనపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రోహిత్ రెడ్డి చెప్పారు. మహేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డి ఆరోపించినట్టుగా ఈ నెల 23న తాను ఆలయానికి వెళ్లిన సమయంలో తన పక్కన రౌడీ షీటర్లు ఎవరూ కూడా లేరని రోహిత్ రెడ్డి చెప్పారు. తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని తిట్టినట్టుగా వైరల్ గా మారిన ఆడియో తనది కాదని మహేందర్ రెడ్డి చెప్పడం ఆయన విజ్థతకే వదిలేస్తున్నట్టుగా రోహిత్ రెడ్డి చెప్పారు. పోలీసులను మహేందర్ రెడ్డి దూషించడం సరైంది కాదన్నారు. పోలీసుల్ని మహేందర్ రెడ్డి దూషించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రోహిత్ రెడ్డి చెప్పారు.
ఎవరు ఎలాంటి వాళ్లో ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు. తాండూరు నియోజకవర్గంలో ఇసుక దందా అనేదే లేదన్నారు. మహేందర్ రెడ్డి ఆరోపించినట్టుగా తాను సర్పంచ్ లను వేధించలేదన్నారు. తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి అందుబాటులో లేరన్నారు. ఈ ఘటనతో తాను మనోవేదనకు గురయ్యాడన్నారు. డీఎస్పీకి కూడా సీఐ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదన్నారు. సీఐని దూషించడాన్ని ఆయన తప్పు బట్టారు. విచారణలో అన్ని వీషయాలు బయటకు వస్తాయన్నారు. రాజకీయాల్లో మహేందర్ రెడ్డికి మర్యాద, గౌరవం ఇస్తానన్నారు. తాను ఎంత గౌరవం, మర్యాద ఇస్తానో కూడా పార్టీలో క్యాడర్ కు తెలుసునని చెప్పారు. మహేందర్ రెడ్డి తనకు దగ్గరి బంధువని కూడా రోహిత్ రెడ్డి వివరించారు. రపార్టీ కార్యక్రమాల్లో మహేందర్ రెడ్డితో కలిసి తాను పాల్గొంటున్న విసయాన్ని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు.