ప్రగతి భవన్‌కు రోహిత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ..

By Sumanth KanukulaFirst Published Dec 19, 2022, 10:40 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు ఈడీ విచారణకు హాజరుకానున్న పైలెట్ రోహిత్ రెడ్డి.. అంతకంటే ముందు ప్రగతిభవన్‌కు చేరుకుని కేసీఆర్‌తో సమావేశమయ్యారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఈరోజు అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. అయితే ఈరోజు ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి.. ఈడీ ఆఫీసుకు వెళ్లడానికి ముందు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రగతి భవన్‌లో ఆయన  కేసీఆర్‌తో భేటీ అయ్యారు. భేటీ  అనంతరం ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లానున్నారు. ఈడీ విచారణను రోహిత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న  సంగతి తెలిసిందే.

ఇక, రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి  న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అలాగే ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. ఈడీ నోటీసులు, ప్రస్తుత పరిణామాలపై కూడా చర్చించారు. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్ రోహిత్ రెడ్డి.. తనకు ఏ కేసులో నోటీసులు ఇచ్చారనేది అధికారులు స్పష్టం  చేయలేదని చెప్పారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్నందుకే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. 
 

click me!