భద్రాచలంలో కొనసాగుతున్న బంద్.. పాల్గొన్న ఎమ్మెల్యే పొడెం వీరయ్య..

By Sumanth KanukulaFirst Published Dec 19, 2022, 10:27 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఈరోజు భద్రాచలం బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో భాగంగా పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్ష పార్టీల నేతలు  నిరసనలు చేపట్టారు. 

కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఈరోజు భద్రాచలం బంద్‌కు పిలుపునిచ్చాయి. భద్రాచలం పట్టణంలో మూడు పంచాయతీలను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య, వామపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 45 జారీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భద్రాచలం బంద్‌కు పిలపునిచ్చారు. జీవో ప్రకారం.. భద్రాచలాన్ని మూడు ఉప పంచాయతీలుగా విభజించారు. ఒకటి భద్రాచలం, రెండోది సీతారామ నగర్, మూడోది శాంతి నగర్. రాష్ట్రంలోనే అతిపెద్ద పంచాయతీ అయిన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు. 2,100 ఎకరాలలో విస్తరించిన ఈ పరిధిలో 40 కాలనీలు ఉన్నాయి. 

ఈ క్రమంలోనే జీవో నెంబర్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈరోజు బంద్‌లో భాగంగా పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్ష పార్టీల నేతలు  నిరసనలు చేపట్టారు. భద్రాచలం పంచాయితీని యథావిథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 45ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. స్థానిక వ్యాపారులు, ప్రజలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. 

బంద్‌లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పొడెం వీరయ్య మాట్లాడుతూ... భద్రాచలం ప్రతిష్ట దెబ్బ తిసేలా చేస్తున్న సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. భద్రాచలం పంచాయితీని మూడు పంచాయితీలుగా విభజన చేసిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలంను మేజర్ పంచాయతీగానే కొనసాగించాలని కోరారు. మేజర్ పంచాయతీ స్థానంలో మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. జీవో నెంబర్ 45ను ఉపసంహరించుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

click me!