
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. ఇటీవల రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ.. డిసెంబర్ 19న ఉదయం 10.30 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2015 నుంచి ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద ఈ నోటీసులు జారీచేసింది. అయితే ఈరోజు ఉదయం రోహిత్ రెడ్డి తరపున ఆయన పీఏ శ్రవణ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు.
విచారణకు మరికొంత సమయం కావాలని రోహిత్ రెడ్డి లేఖను ఆయన పీఏ ఈడీ అధికారులకు అందజేశారు. ఈడీ అధికారులు కోరిన సమాచారం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని అన్నారు. అయితే రోహిత్ రెడ్డి చేసిన అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా ఈడీ కోరిన కొంత సమాచారం సమర్పించనున్న రోహిత్ రెడ్డి.. మిగిలిన సమాచారం సమర్పించేందుకు మరింత సమయం కావాలని ఆయన స్వయంగా అధికారులను కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ ఆయన సీఎం కేసీఆర్‌తో మరోసారి ఈడీ నోటీసులు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు.