మంచిర్యాల సజీవ దహనం కేసు : వారం రోజులుగా రెక్కీ చేసి, సమాచారం కోసం సుపారీ ఇచ్చీ.. విచారణలో షాకింగ్ విషయాలు...

By SumaBala Bukka  |  First Published Dec 19, 2022, 12:53 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన మంచిర్యాల జిల్లా ఆరుగురు సజీవ దహనం కేసులో వారం రోజులపాటు రెక్కీ నిర్వహించారని తేలింది. పక్కా పథకం ప్రకారమే హత్యకు చేశారని సమాచారం. 


మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 6గురు సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటన ఘటనా స్థలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న  త్రిబుల్ సీ పెట్రోల్ బంక్ లో ముగ్గురు వ్యక్తులు రూ.5వేలు పెట్టి పెట్రోల్ కొన్నారు. ఈ మేరకు సిసిటివి ఫుటేజీలో వెలుగు చూసింది.  దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీరితో పాటు మరో పది మందిని పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో లక్సెట్టిపేట కు చెందిన ఓ వ్యక్తి..  గోదావరిఖనికి  చెందిన ఐదుగురు,  ఉట్కూర్ కు చెందిన ఓ వ్యక్తి, గుడిపల్లికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. వివరాల కోసం వీరిని విచారిస్తున్నట్లు గా తెలుస్తోంది. దీని ప్రకారం..లక్సెట్టిపేట, ఉట్కూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు  మంచిర్యాలలోని ఓ లాడ్జిలో వారం రోజుల నుంచి ఉంటున్నారు. వీరు చాలాసార్లు రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత  డిసెంబర్ 16వ తేదీన సీసీసీ పెట్రోల్ బంకులో రాత్రి 9.54 నిమిషాలకు ముందుగా సిద్ధం చేసుకున్న డబ్బాల్లో పెట్రోల్ కొనుగోలు చేశారు. దీనికోసం శ్రీరాంపూర్ కు చెందిన ఆటో మాట్లాడుకున్నారు. 

Latest Videos

ఆ తర్వాత  గుడిపెల్లికి చేరుకున్నారు. గుడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆధారాలు దొరకకుండా ఉండాలని ఊరికి చేరడానికి దగ్గర దారిలో కాకుండా.. చుట్టూ తిరిగి రసూల్పుర మీదుగా మరో పదిహేను కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించి చేరుకున్నారు. వెళుతున్న క్రమంలో మధ్యలో ఆగి మద్యం సేవించారు. ఆ తర్వాత  రాత్రి 11:15 కు గుడిపల్లి  శివార్లకు చేరుకున్నారు. ఆ తరువాత 11.45-12.15 సమయంలో తాము రెక్కీ నిర్వహించిన ఇంటి తలుపుల ద్వారా లోపలికి.. డబ్బాల్లో తెచ్చిన పెట్రోల్ పోసి, నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో.. లోపలి వారి కేకలు,  మంటల శబ్దాలకు చుట్టుపక్కల వారు మేల్కొన్నారు.  అది గమనించి  తమతో పాటు తీసుకువచ్చిన పెట్రోలు డబ్బాలను అక్కడే చింత చెట్టు దగ్గర వదిలేశారు. 

మంచిర్యాలలో ఆరుగురి సజీవదహనం: ప్రియుడితో కలిసి భార్య చేసిన పని..!

ఆ తరువాత, తాము అక్కడికి రావడానికి ఉపయోగించిన ఆటోలోనే పరారయ్యారు. అక్కడ నుంచి నేరుగా  అంతకుముందు బసచేసిన లాడ్జికి చేరుకున్నారు. వెంటనే తమ సామాన్లు తీసుకుని 17వ తేదీన  లాడ్జి ఖాళీ చేసి వెళ్ళిపోయారు.  అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూరుకు చెందిన వ్యక్తికి నేర చరిత్ర ఉంది. అంతకు ముందే అతనిపై హత్య కేసు ఉంది.  ఈ మేరకు పోలీసులు విచారణలో తేలింది. అతని తల్లికి... మంటల్లో సజీవ దహనమైన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉంది. దీంతో 15 సంవత్సరాల క్రితం అతడిని చంపేసినట్లు గా విచారణలో తేలింది.

ఇంటికి నిప్పు పెట్టేముందు.. నిందితులు గుడిపల్లికి చెందిన ఓ వ్యక్తితో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అతను నిందితులకు సహకరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. తాము చంపాలనుకున్న మాస పద్మ శివయ్య దంపతులు, శాంతయ్య  ఊర్లో ఉన్నారా? లేదా? పక్కా సమాచారం ఇవ్వాలని అతనికి రూ.3లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి ఘటన జరిగిన రోజు ఫుల్లుగా మద్యం తాగాడు,  ఆ మత్తులో ఇంట్లో ముగ్గురే ఉన్నారని తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ ముగ్గురితో పాటు వాళ్లింటికి వచ్చిన చుట్టాలైన మౌనిక, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మంటల్లో సజీవ దహనమయ్యారు. 

ఈ సమాచారం ఇచ్చిన వ్యక్తి ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కూడా అక్కడే ఉన్నాడని..  అక్కడ జరుగుతున్నదంతా ఎప్పటికప్పుడు సమాచారం హంతకులకు అందించాడని పోలీసులు తేల్చారు. ఘటన జరిగిన తీరు హృదయవిదారకంగా ఉంది. చుట్టపుచూపుగా వచ్చిన మౌనిక తన ఇద్దరు పిల్లలతో కాలి బూడిద అవ్వడం అందరినీ కంటనీరు పెట్టిస్తుంది. తన రెండేళ్ల కూతురు ప్రశాంతిని ఒడిలో ఉంచుకుని మౌనిక.. అలాగే చనిపోయింది. మృతుల ఎముకలు, ఇతర శరీర భాగాలు తలుపులు, కిటికీల సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి.. బయటికి వెళ్లడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా తలుపులు, కిటికీలు దగ్గరికి చేరుకున్నారు. కానీ అవి బయట నుంచి గడియ వేసి ఉండడంతో తప్పించుకోలేకపోయారు.

ఈ సజీవదహనం ఘటనలో మృతి చెందిన శాంతయ్య శవం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు పోలీసులు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆదివారం కూడా ఎవరూ రాలేదు. దీంతో గోదావరిఖనిలో ఆయన కుటుంబ సభ్యులు, అనుమానం ఉన్న కొంతమంది బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గుడిపల్లి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, 2023 జనవరి 27వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది.

click me!