హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య.. ఆ పుస్తకం వల్లేనా..?

First Published Aug 9, 2018, 9:11 AM IST
Highlights

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరకాశీకి చెందిన రజనీష్ అర్మార్ (22) అనే యువకుడు సెంట్రల్ వర్సిటీలో ఇంటీగ్రేటేడ్ ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరకాశీకి చెందిన రజనీష్ అర్మార్ (22) అనే యువకుడు సెంట్రల్ వర్సిటీలో ఇంటీగ్రేటేడ్ ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. గత నెల 15న అడ్మిషన్ తీసుకుని 19న విశ్వవిద్యాలయానికి వచ్చాడు. అతనికి హెచ్‌సీయూ హాస్టల్‌లో సౌత్ ఐ బ్లాక్ రూం నెంబర్-24ను కేటాయించారు.

ఇలా ఉండగా బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత.. స్నేహితులతో కాసేపు మాట్లాడిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గదిలోకెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకున్నాడు.. సాయంత్రం 8.30 గంటలు కావొస్తున్నా బయటకు రాలేదు. తోటి విద్యార్థులు తలుపు తట్టినా తీయలేదు.. దీంతో వారు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి తలుపు బద్ధలు కొట్టి లోపలికెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలీ పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం రజనీష్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇక్కడ చదువుకోవడం ఇష్టం లేదని.. తల్లిదండ్రులు తన బాధను అర్థం చేసుకోవడం లేదని తరచూ రజనీష్ చెప్పేవాడని తోటి విద్యార్థులు తెలిపారు.

కాగా వారం క్రితం తన అడ్మిషన్ రద్దు చేసుకున్నాడు. హాస్టల్ కూడా ఖాళీ చేసి వెళ్లిపోతున్నానని అనుమతి ఇవ్వాల్సిందిగా వార్డెన్‌కు లెటర్ కూడా రాశాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతనికి నౌషియా అనే పుస్తకం చదివే అలవాటు ఉందని దాని ద్వారా ప్రతి విషయాన్ని నెగిటివ్‌గా తీసుకుని నిత్యం తనలో తాను కుమిలిపోయేవాడని రజనీష్‌తో సన్నిహితంగా ఉండే విద్యార్థి తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!