అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు అనేక రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. ఇలా తెలంగాణలో కూడా సెలవు ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఓ న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.
హైదరాబాద్ : శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరాన్ని రేపు(జనవరి 22 సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మందిర ప్రాణప్రతిష్ట వేళ కేవలం అయోధ్యలోనే కాదు యావత్ దేశంలో వేడుకలు జరగనున్నాయి... ఇందుకోసం హిందూ సమాజంమంతా సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజలు పిల్లాపాపలతో ఈ వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రేపు సెలవు ప్రకటించాలని బిజెపి నాయకులతో పాటు పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణకకు చెందిన శ్రీనివాస్ అనే న్యాయవాది అయితే ప్రభుత్వం సెలవు ప్రకటించేలా ఆదేశించాలంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. జనవరి 22ప అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక సెలవుదినంగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసారు. తన పిటిషన్ ను వెంటనే విచారించి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు శ్రీనివాస్.
ఇక బిజెపి ఎంపీ బండి సంజయ్ కూడా జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూడాలని... పార్టీలకు అతీతంగా తమ గ్రామాలు, పట్టణాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని సంజయ్ డిమాండ్ చేసారు.
Also Read రామభక్తుడిగా అసదుద్దీన్ ఓవైసి ... రామనామ స్మరణ తప్పదు..: విహెచ్‌పి నేత సంచలనం
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనవరి 22న సెలవు ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను పొడిగించిన వైసిపి ప్రభుత్వం సరిగ్గా జనవరి 22న విద్యాసంస్థలను పున:ప్రారంభిస్తోంది. దీంతో ఆ ఒక్కరోజు కూడా సెలవులను పొడిగించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరి డిమాండ్ చేస్తున్నారు.
అయోధ్య రామమందిరం అనేది దేశంలోని మెజారిటీ హిందూ ప్రజల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం... అలాంటి ఆలయ ప్రారంభోత్సవం రోజున సెలవు ఇవ్వకపోవడం దారుణమని పురంధీశ్వరి అన్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో విషపూర్తిత ఆలోచనలకు నిదర్శమని అన్నారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి... అలాంటిది ప్రభుత్వం మాత్రం ఒక్కరోజు సెలవు పొడిగించలేదన్నారు.వెంటనే ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని పురందీశ్వరి డిమాండ్ చేసారు.
ఇదిలావుంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు అంటే రేపు ఉత్తరప్రదేశ్ లో అధికారిక సెలవు ప్రకటించారు. అలాగే బిజెపి పాలిత మధ్య ప్రదేశ్, గోవాలో పూర్తి రోజు... అస్సాం, గుజరాత్, చత్తీస్ ఘడ్, హర్యానా, త్రిపుర, ఒడిషా రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు ప్రకటించారు.