బీజేపీకి షాక్.. వరంగల్‌లో జేపీ నడ్డా సభకు అనుమతి రద్దు

By Siva KodatiFirst Published Aug 25, 2022, 9:39 PM IST
Highlights

ఈ నెల 27న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి రద్దయ్యింది. పోలీస్ పర్మిషన్ లేని కారణంగా సభకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. 

తెలంగాణ బీజేపీ , టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని నెలలుగా బీజేపీని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వుందంటూ బీజేపీ నేతలు ఆరోపించడం, బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం, రాజాసింగ్ అరెస్ట్, కేటీఆర్ సన్నిహితులపై ఈడీ , ఐటీ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉప్పూనిప్పుగా వుంది వ్యవహారం. 

సరిగ్గా ఇదే సమయంలో వరంగల్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న సభకు అనుమతి రద్దయ్యింది. ఈ నెల 27న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించాలనుకుంది.. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిని రద్దు చేసింది కళాశాల యాజమాన్యం. ఈ సభకు పోలీసుల అనుమతి లేదని , అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. 

ALso REad:ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ.. కొత్తగా మతపిచ్చిగాళ్లు, నిద్రపోతే ప్రమాదమే: కేసీఆర్ వ్యాఖ్యలు

అయితే.. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపును పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన వరంగల్ లో  సభను నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు  తేల్చి చెబుతున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. దీంతో సభను ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం నిర్ణయంతో కాషాయ నేతలకు షాక్ తగిలినట్లయ్యింది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

click me!