
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకుడు టి రాజా సింగ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ముస్లింలు శాంతించాలని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఎవరూ ఆందోళనలను చేయకూడదని విజ్ఞప్తి చేశారు. నేడు శుక్రవారం శాంతియుతంగా ప్రార్థనలను నిర్వహించాలని కోరారు. ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకొని సస్పెండ్ చేయాలన్న పెద్ద డిమాండ్ నెరవేరిందని చెప్పారు.
ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశ సామరస్యానికి విఘాతం కలిగించే ఎలాంటి నినాదాలు చేయవద్దని ముస్లింలందరినీ కోరుతున్నాను అని ఒవైసీ కోరారు. ‘‘ అతడిని అరెస్టు చేయడమే మన అందరి అతిపెద్ద డిమాండ్. అది పీడీ యాక్ట్ ద్వారా నెరవేరింది. శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని నేను అందరినీ కోరుతున్నాను ’’ అని ఆయన అన్నారు.
మరోవైపు ప్రవక్త వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నాయకుడు రాజాసింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున తెలంగాణలో నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఆయనపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) నమోదు చేశారు. అనంతరం అదుపులోకి తీసుకొని చెర్లపల్లిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
‘‘18 మతపరమైన నేరాలలో ప్రమేయం ఉన్న, బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నాయకుడిపై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టీ.రాజా సింగ్‌ను 1986 యాక్ట్ నెంబర్ 1 కింద ఆగస్టు 25న పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
రాజాసింగ్ కు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం అలవాటు అని, ప్రజా సంఘర్షణకు దారితీసే వ్యాఖ్యలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. యూట్యూబ్‌లో ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అవ్వడం వల్ల హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయని పేర్కొన్నారు. “ ఇది వర్గాల మధ్య చీలిక తెచ్చి హైదరాబాద్, తెలంగాణ శాంతియుత రాష్ట్ర స్వభావానికి భంగం కలిగించింది ’’ అని పోలీసులు తెలిపారు.
ఆహారం వడ్డింపు విషయంలో గొడవ.. భార్య ప్రాణాలు తీసిన భర్త
రాజాసింగ్ మహ్మద్ ప్రవక్త, ఆయన జీవనశైలికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దైవదూషణ చేశారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సారిగా మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టు ఆదేశాలతో ఆయన విడుదలయ్యారు. అతడిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 153(A), 295, 505 కింద దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ స్పందించింది. పార్టీ ఆయనను సస్పెండ్ చేసిందని పేర్కొంది. రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీ తీరుకు విరుద్ధమని తెలిపింది.