హైద్రాబాద్ గోషామహల్ చాక్నవాడిలో కుంగిన పెద్ద నాలా: కుప్పకూలిన దుకాణాలు, పడిపోయిన వాహనాలు

By narsimha lodeFirst Published Dec 23, 2022, 2:22 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలోని గోషామహల్ చాక్నవాడిలో  పెద్దనాలా కుంగిపోయింది. ఈ ఘటనలో  పలువురు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటనస్థలానికి చేరుకున్నారు.


హైదరాబాద్: నగరంలోని గోషామహల్  చాక్నవాడిలో  శుక్రవారంనాడు పెద్దనాలా కుంగిపోయింది. ఈ నాలాలో  కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు  పడిపోయాయి. నాలాపై  ఉన్న దుకాణాలు కూడా నాలాలో  పడిపోయాయి.  ఈ ఘటనలో  పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

గోషామహల్  లో  నడి రోడ్డుపై  ఉన్న  పెద్ద నాలా  అర కిలోమీటరు దూరం  కుంగిపోయింది. నాలాపై  నిలిపి ఉన్న వాహనాలు  నాలాలో పడిపోయాయి.  ఇవాళ  సంత కావడంతో  నాలాపైనే  కూరగాయాలతో  ఇతర సరుకులను వ్యాపారులు విక్రయిస్తున్నారు.   ఈ ప్రాంతంలో  పార్క్ చేసిన  వాహనాలు నాలాలో  పడిపోయాయి.  నాలాపై దుకాణాలు నిర్వహిస్తున్నవారు  నాలా కుంగిపోవడంతో  అందులో పడిపోయారు.  భారీ శబ్దం  చేస్తూ  నాలా కుంగిపోయిందని  స్థానికులు  చెబుతున్నారు.

1980, 1990లలో  కూడా  ఈ నాలా  కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు.  ఇవాళ మరోసారి కూలింది.  అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి , గోషామహల్  పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా  మురికి నీరు  ప్రవహించనుంది. ఇష్టానుసారంగా  ఈ నాలాపై ఆక్రమణలు నిర్మించారని  అధికారులు  చెబుతున్నారు. దీని కారణంగా  నాలా కుంగిపోయిందనే  అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

పెద్దనాలా కుప్పకూలిన  ప్రాంతాన్ని  స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పరిశీలించారు.   నాలా కుప్పకూలిన ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఆదేశించారు.  నాలా కుప్పకూలిన రోడ్డును  బ్లాక్ చేయాలని  మంత్రి  ఆదేశించారు.  ఈ ప్రాంతంలో  కొత్తగా  రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

click me!