రాజాసింగ్ కు 12 నెలల పాటు నిర్బంధం.. జీవో జారీ.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం..

By SumaBala Bukka  |  First Published Oct 29, 2022, 10:52 AM IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో సలహామండలి ఆమోదించించిన తరువాత పీడీ చట్టం కింద నిర్బంధించామని.. దీంతో 12 నెలల పాటు నిర్భంధిస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. 


హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని సలహామండలి ఆమోదించిందని, దీంతో 12 నెలల పాటు నిర్భంధిస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ఆగస్టు 25న రాజాసింగ్ ను పీడీ చట్టం కింద అరెస్టు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై  జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని వాదనలు వినిపించారు. 

రాజాసింగ్  కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా టీవీల్లో ప్రసంగించిన అంశాలను పరిగణలోకి తీసుకుని పీడీ చట్టంకింద నిర్బంధించారని, దాన్ని సలహా మండలి ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 19న తాజాగా జీవో జారీ చేసిందని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేశారా? అని ప్రశ్నించారు. సవరణ పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. 

Latest Videos

హైదరాబాద్ సిటీ వదిలి వెళ్లొద్దు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు..

ఇదిలా ఉండగా, అక్టోబర్ 20న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ రద్దు చేయాలంటూ ఆయన భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. పీడీయాక్ట్ పెట్టడానికి గల కారణాలను కౌంటర్‌లో పేర్కొనాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయకుంటే ఆర్డర్ ఇస్తామని తెలిపింది. 

ఇక, తన భర్త రాజాసింగ్‌పై మోపిన పీడీ యాక్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించి, ఆయనను విడుదల చేయాలని రాజా సింగ్ భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈ నెల 11న జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డి, జస్టిస్ శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  పీడీ  యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఇటీవలనే ముగిసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ బోర్డు నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉందన్నారు. ఈ నిర్ణయం వచ్చే వరకు సమయం కావాలని కోరారు. కనీనం రెండు వారాల సమయం ఇవ్వాలని అడిగారు. 

మరోవైపు ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్ తరపున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవి చందర్‌ వాదనలు వినిపిస్తూ.. సకాలంలో ఎమ్మెల్యేకు పత్రాలు అందించడంలో పోలీసులు విఫలమైనందున, హైదరాబాద్‌ పోలీసులు జారీ చేసిన పీడీ యాక్ట్‌ను పక్కన పెట్టి జైలు నుంచి విడుదల చేసేందుకు అవకాశం ఉందని వాదించారు. ఇరువైపుల వాదలను విన్ని ధర్మాసనం.. ఇందుకు సంబంధించి అక్టోబర్ 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ నెల 28కి వాయిదా వేసింది. 

click me!