పేటిఎం ఖాతాల నుంచి నగదు మాయం: బడా చోర్ పట్టివేత

First Published May 9, 2018, 11:52 AM IST
Highlights

ఇతరు పేటిఎం నుంచి నగదు కాజేస్తూ వస్తున్న దొంగను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్: ఇతరు పేటిఎం నుంచి నగదు కాజేస్తూ వస్తున్న దొంగను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. పెటిఎం వ్యాలెట్ కార్యాలయంలో పనిచేసిన ఓ యువకుడు ఇతరుల నగదును కాజేయడమే పనిగా పెట్టుకున్నాడు. 

తన మాయమాటలతో కస్టమర్లను నమ్మించి వారి పాస్ వర్డ్ సేకరించి వారి ఖాతాలోని డబ్బులను తన ఖాతాలోకి మార్చుకుంటూ వస్తున్నాడు. తెలంగాణలోని జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లె గ్రామ పరిధిలోని హనుమాన్ టెంపుల్ తండాకు చెందిన వకునోద్ అనిల్ కుమార్ ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరె్టు చేశారు.

సైబర్ క్రైమ్ ఎసిపి హరినాథ్ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. కార్యాలయం ద్వారా పిటిఎం వ్యాలెట్ ను తీసుకున్న కస్టమర్ల కేవైసి (నో యువర్ కస్టమర్) వివరాలను విచారించడం, సమస్యలుంటే పరిష్కరించడం అనిల్ విధి. 

పిటిఎం వ్యాలెట్ ను వాడుతున్న కస్టమర్ల వద్దకు వెళ్లినప్పుడు తనకున్న సాంకేతిక పరిజ్ఝానంతో వారికి అనుమానం రాకుండా తనకు అనుకూలంగా కొన్ని సెట్టింగ్స్ చేసుకునేవాడు. పాస్ వర్డ్ లను మార్చేసి దాన్నే వాడాలని చెప్పేవాడు. ఆ తర్వాత కస్టమర్ల ఖాతాలోని డబ్బును కొంత తన ఖాతాలోకి బదలాయించుకునేవాడు. 

కొన్ని రోజులకు ఉద్యోగం వదిలేసి కస్టమర్లను మోసగించడమే పనిగా పెట్టుకున్నాడు. పాత కస్టమర్లకు ఫోన్ చేసి కస్టమర్ల పరిధిని లక్ష రూపాయల దాకా పెంచుతామని నమ్మించి పాస్ వర్డ్ వివరాలు తీసుకుని మోసం చేస్తూ వచ్చాడు.

చీకటిమల్ల వినోద్ కుమార్ అనే వ్యాపారి మీర్ పేట పరిధిలోని శివగంగ హిల్స్ కాలనీలో సొంత ఇంట్లోనే కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతనికి అనిల్ ఫోన్ చేసి పెటిఎం వ్యాలెట్ కేవైసీ పత్రాలు ఎంక్వైరీ చేసి వ్యాలెట్ పరిధిని పెంచుతామని నమ్మించాడు. రెండు రోజుల తర్వాత వచ్చి పిటిఎంను చెక్ చేసి కేవైసీ వివరాలు పరిశీలించి వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత తన పెటిఎం వ్యాలెట్ నుంచి రూ.5000 వేరే పేటిఎంకు బదిలీ అయినట్లు వినోద్ గుర్తించాడు. అనుమానం కలిగి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బీరప్పగుడలో అనిల్ ను అరెస్టు చేసారు. అతను ఇప్పటి వివిధ కస్టమర్లను లక్ష రూపాయల దాకా మోసగించినట్లు తెలుస్తోంది.

click me!