Telangana Elections: మరో జనసేన పార్టీతో పవన్‌కు కొత్త చిక్కులు.. ఈ కన్ఫ్యూజన్‌ను ఎదుర్కొనేదెలా?

By Mahesh K  |  First Published Nov 12, 2023, 6:49 PM IST

పవన్  కళ్యాణ్ పార్టీ జనసేనకు కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల గుర్తు విషయమై ఆందోళనల్లో ఉండగా.. తాజాగా మరో పార్టీ రూపంలో చిక్కులు ఎదురయ్యాయి. జనసేనతోపాటు జాతీయ జనసేన అనే మరో పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగడం, ఆ పార్టీ గుర్తు కూడా గాజు గ్లాసును పోలి ఉండటంతో జనసేన అభ్యర్థుల్లో ఆందోళనలో పడ్డారు.
 


హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఇక్కడి నుంచి లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తున్నది. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగుతున్న జనసేనకు కొత్త కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. వీటిని ఎదుర్కొనేదెలా? అని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణలో జనసేన గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో ఆ పార్టీ సింబల్‌ను ఫ్రీ సింబల్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా గాజు గ్లాసు గుర్తును జనసేన కోసం ఎన్నికల సంఘం రిజర్వ్ చేయలేదు. దీంతో ఆ గ్లాసు సింబల్ కోసం ప్రత్యేకంగా జనసేన నేతలు ప్రతిపాదించాల్సిన అవసరం ఏర్పడింది. అది దక్కకుంటే స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగాల్సి ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పార్టీకి మరో చిక్కు వచ్చి పడింది. ఈ సారి జాతీయ జనసేన పార్టీ రూపంలో ఈ చిక్కు వచ్చింది. జనసేన పార్టీ పేరును పోలిన జాతీయ జనసేన పార్టీ కూడా బరిలోకి దిగుతున్నది. ఆ పార్టీ సింబల్ బకెట్. పేర్లు, ఎన్నికల గుర్తుల్లో సారూప్యత ఉండటంతో జనసేన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ముప్పు ఉందని భావిస్తున్నారు.

Also Read: సీఎంకు కూడా బాకీ ఇచ్చాడుగా.. సంపన్న నేత వివేక్ అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు

తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నది. ఇందులో చాలా వరకు ఏపీ సెటిలర్లు ఉన్న స్థానాలు ఉన్నాయి. కూకట్‌పల్లి వంటి స్థానాల్లో గెలుస్తామనే ధీమా జనసేనకు ఉన్నది. కానీ, ఈ స్థానంలో జాతీయ జనసేన అభ్యర్థి కూడా బరిలో ఉండటంతో వారి గెలుపు ఆశలు గండిపడే ముప్పు ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.

ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలా? అని ఆలోచనలు చేస్తున్నారు. ఇంకా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నది. ఇంతలో ఆ పార్టీ అభ్యర్థితో సంప్రదింపులు జరిపి పోటీ విరమించుకునేలా సర్దిచెప్పాలని భావిస్తున్నట్టు భోగట్టా.

click me!