
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పెద్దకంజెర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడి పందాలను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నారని.. పోలీసులు ఆయనతో పాటు మరికొందరి కోసం గాలిస్తున్నారని చెప్పారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే చింతమనేని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను కోడి పందాల నిర్వహణలో లేనని చెప్పారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు.
అయితే ఈ క్రమంలోనే చింతమనేని వ్యాఖ్యలపై పటాన్‌చెరు డీఎస్పీ బీమ్‌రెడ్డి స్పందించారు. ఆయన ఓ తెలుగు న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. పటాన్ చెరు శివారు ప్రాంతంలోని మామిడి తోటలో కోడి పందాలు నిర్వహించారని చెప్పారు. కోడి పందాల నిర్వహణలో చింతమనేని కీలకంగా ఉన్నారని.. తాము రైడ్ చేసిన సమయంలో అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. అక్కడ పట్టుబడ్డవారు చింతమనేని పేరు చెప్పారని తెలిపారు.
వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసిన కోడి పందాలు నిర్వహిస్తున్నారని డీఎప్పీ భీమ్ రెడ్డి చెప్పారు. తొలుత బీదర్‌లో కోడి పందాలు ఆడించాలని అనుకున్నారని.. అక్కడ పోలీసులతో సమస్యలు ఉండటంతో పటాన్ చెరుకు షిఫ్ట్ చేశారని తెలిపారు. మామిడి తోటలో ఇంతకు ముందు కూడా కోడి పందాలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. చింతమనేని కోడి పందాలు ఆడించాడనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. చింతమనేని ప్రభాకర్‌తో పాటు పరారీలో ఉన్న 40 మంది కోసం గాలింపు చేపట్టినట్టుగా తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
ఇక, పోలీసులు పక్కా సమాచారంతో బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పెద్దకంజెర్ల గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడుల్లో అక్రమ కోడిపందాల రాకెట్‌లో పాల్గొన్న 21 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదు, 26 బైక్‌లు, 27 సెల్‌ఫోన్లు, 30 కోడి కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ రాకెట్ నిర్వహిస్తున్నారని పటాన్‌చెరు డీఎస్పీ బీమ్‌రెడ్డి తెలిపారు. చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, అక్కినేని సతీష్ బృందంగా ఆడుతున్నారని చెప్పారు. దాడి చేసిన సమయంలో అక్కడ 70 మంది వరకు ఉన్నారని చెప్పారు. చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీష్, బర్ల శ్రీనులను అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు.
అయితే కోడి పందాల్లో తాను పాల్గొన్నట్టుగా వచ్చిన వార్తలను చింతమనేని ఖండించారు. కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టుగా చూపడం కొందరి జెండా.. అజెండా అని పేర్కొన్నారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు.