బ్రాహ్మణుల కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు...హరీశ్ రావు

By ramya neerukondaFirst Published Sep 19, 2018, 12:08 PM IST
Highlights

రాబోయే శాసనసభ ఎన్నికల్లో తామంతా టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్బంగా మంత్రిని కలిసిన బ్రహ్మణ,అర్చకుల బృందం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం  ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ టి.హరీష్ రావు తెలిపారు.మంగళవారం మంత్రి హరీష్ రావు  ని పలు బ్రాహ్మణ సంఘాల నేతలు, వేదపండితులు, అర్చకులు వారి నివాసంలో కలిసి వేద ఆశీర్వచనం అందించారు. 
సిద్ధిపేట జిల్లాలో పలు పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం సర్వశ్రేయోనిధి నుంచి కోట్లాది రూపాయల మంజూరు చేయించడమే కాకుండా 142 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకంలో చేర్చి పేద బ్రాహ్మణులను, అర్చకులను ఆదుకున్నందుకు వారంతా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి కి వేద ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలు, శాలువా, పూలహారం, పుష్పగుచ్ఛం,ప్రసాదం తో ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి బ్రాహ్మణులనుద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎపుడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బ్రాహ్మణుల పురోభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని అన్నారు.పురాతన దేవాలయాల పునరుద్ధరణ, పేద అర్చకుల ఉపాధి సంక్షేమం కోసం ధూపదీప నైవేద్య పథకం తదితర ఎన్నో ధార్మిక సంబంధ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి హరీష్ రావు వివరించారు. 

టీఆర్ఎస్ పార్టీకి బ్రాహ్మణుల దీవెనలు ఉండాలని కోరారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తామంతా టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్బంగా మంత్రిని కలిసిన బ్రహ్మణ,అర్చకుల బృందం తెలిపింది.సిద్ధిపేట జిల్లా చేర్యాల శివారు కడవేర్గులోని పురాతన లక్మీనారాయణ దేవాలయ పునరుద్ధరణ కోసం, అలాగే కొండపాక రుద్రేశ్వరాలయంలో వేదపాఠశాల ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి హరీష్ రావు బ్రాహ్మణుల బృందానికి హామీ ఇచ్చారు. 


మంత్రితో సమావేశమయిన  బ్రాహ్మణుల బృందంలో సీనియర్ పాత్రికేయులు తిగుళ్ల కృష్ణమూర్తి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు, దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవసంఘ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎం రామచంద్రమూర్తి, వేదభారతి ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు గౌరీభట్ల సుబ్రహ్మణ్యశర్మ, సిద్ధిపేట జిల్లా బ్రాహ్మణ సంఘ ముఖ్యులు అప్పాల మాధవ శర్మ, రాధాపతి శర్మ,తెలంగాణ అర్చకసంఘం నాయకులు రాయప్రోలు మల్లికార్జునశర్మ,సీతారామశర్మ, భాగ్యనగర అర్చక పురోహిత సంఘం ముఖ్యులు జగన్మోహన్ శర్మ వేదపండితులు గుండు రామ శర్మ, తిగుళ్ల దామోదర శర్మ సిద్ధాంతి,నారాయణ శర్మ, శ్యామ్మోహన్ శర్మ తదితరులున్నారు.

click me!