ఆర్టీసీ సమ్మె: హైకోర్టులో ఓయూ విద్యార్ధి హౌస్‌ మోషన్ పిటిషన్

By narsimha lodeFirst Published Oct 6, 2019, 12:24 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె విరమణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతూ  హైకోర్టులో ఆదివారం నాడు పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తోందో చూడాలి.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు  కుందన్ బాగ్ లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో వాదనలు జరగనున్నాయి. 

 ఓయూ విద్యార్ధి సుదేంద్రసింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని హామీ ఇచ్చిందని  ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ హామీని అమలు చేయకపోవడం వల్లే కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

ఈ హామీని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరిన పిటిషనర్  ఆర్టీసీ సమ్మె కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. పండగ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో స్వంత ఊళ్లకు వెల్లేందుకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.

ఈ విషయమై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుదేంద్రసింగ్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని కూడ పిటిషనర్ కోరారు. 

ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వంతో పాటు, పిటిషన్ తరుపున న్యాయవాదులు వాదనలను విన్పించనున్నారు.

ఈ నెల 5వ తేదీ ఉదయం నుండి  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.ఈ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ బస్సులు ప్రయాణీకుల నుండి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆదివారం నాడు మధ్యాహ్నం సీఎం కేసీఆర్  ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 
 

click me!