నాగార్జునసాగర్ డ్యామ్ లో అరుదైన జీవులు... నీటి కుక్కల సందడి (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 22, 2021, 9:51 AM IST
Highlights

భారీ వర్షాలతో నాగార్జునసాగర్ డ్యామ్ లో నీటిమట్టం పెరగుతుండటంతో అందులో జీవించే అరుదైన జంతుజాలం బయటపడుతోంది. సాగర్ ఒడ్డున నీటికుక్కలు సందడి చేస్తున్నాయి. 

నల్గొండ: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు జలకలను సంతరించుకున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అందులోని అరుదైన జీవరాశులు బయటపడుతున్నాయి. ఇలా నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి.  

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైంది. దీంతో సాగర్ లో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో జలాశయంలోంచి నీటికుక్కలు బయటకు వస్తున్నాయి. రిజర్వాయర్ వాటర్ స్కేల్ వద్ద నీటికుక్కలు సందర్శకులకు దర్శనమిస్తున్నాయి. 

వీడియో

చాలా అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని నీళ్లలోనే జీవిస్తాయి. నీళ్ల లోపల ఈదుతూ జీవించడమే కాదు నీళ్ల బయట కూడా ఇవి జీవించగలవు. అంటే ఉభయ చర జీవులన్నమాట. 
 
నీటి కుక్కలు చాలా అరుదైన జాతి. ఇవి ప్రస్తుతం అంతరించిపోతున్న జీవుల జాబితాలో వున్నాయి. ఇప్పటికే నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని... కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

click me!