
Osmania University: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభనను దృష్ట్యాలో పెట్టుకుని విద్యా సంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు ఆన్‌లైన్ విధానంలో.. తరగతులను నిర్వహిస్తున్నాయి. అలాగే.. సంక్రాంతి తర్వాత.. విద్యాసంస్థలను తెరవాలని, ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించాలని భావించారు. కానీ కరోన విజృంభించడంతో విద్యా సంస్థలకు సెలవులు పొడగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తరుణంలో ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతులిచ్చాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్రంలోని పాఠశాలలను ఫిబ్రవరి 1నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భిన్నంగా ఆన్‌లైన్ క్లాసుల కొనసాగింపునకే మొగ్గు చూపింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలు తిరిగి ప్రారంభంకావాల్సి ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్(undergraduate), పోస్ట్ గ్రాడ్యుయేట్ (postgraduate) కోర్సుల సెమిస్టర్లన్నింటికీ ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులను కొనసాగించాలని ప్రకటన జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో సోమవారం ఓయూలో యూనివర్సిటీ క్యాంపస్ ప్రిన్సిపల్స్, యూనివర్సిటీలోని ఇతర అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొన్ని రోజులు ఆన్‌లైన్ విద్యకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ప్రాతిపదికన పని చేస్తున్నబోధన సిబ్బంది, సహా బోధనా సిబ్బంది జనవరి 31 నుండి కళాశాల విధులకు హాజరు కావాలని తెలిపారు. వారు ఫిబ్రవరి 1 నుండి కళాశాలలో ఆన్‌లైన్ తరగతులు తీసుకోవాలని, కోవిడ్ తగిన ప్రవర్తనను అనుసరించాలని, సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.