ఈ రోజు ఆరు కేసులే, దాచేస్తే దాగేవి కావు: ప్రతిపక్షాలపై ఈటెల ధ్వజం

By telugu teamFirst Published May 1, 2020, 7:01 PM IST
Highlights

గత 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. టెస్టులు సరిగా చేయడంలేదనే ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో కేవలం 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1040కి చేరుకుంది. ఈ రోజు 22 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 552 ఉన్నాయి.
 
తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఈటెల రాజేందర్ శుక్రవారం సాయంత్రం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని ఐసిఎంఆర్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. టెస్టులు తక్కువ చేస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. లాక్ డౌన్ ను పూర్తిగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. 

కరోనా లక్షణాలు ఉంటేనే ఆస్పత్రుల్లో చికిత్స చేయాలని ఐసిఎంఆర్ సూచించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి, కింగ్ కోఠి, గాంధీ ఆస్పత్రులను కేంద్రం పరిశీలించిందని ఆయన చెప్పారు. ఆస్పత్రులను పరిశీలించిన తర్వాత రాష్ట్రం తీసుకున్న చర్యలు కేంద్ర బృందం ప్రశంసించిందని ఆయన చెప్పారు.

కరోనా కేసులు, మరణాలు దాచేస్తే దాగేవి కావని ఆయన అన్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాలల్లో మాదిరిగానే హైదరాబాదులోనూ చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో కూడా పూర్తి స్థాయి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 22 మినహా కరోనా వైరస్ కేసులన్నింటినీ ట్రేస్ చేశామని, ఈ 22 మందికి కూడా కరోనా వైరస్ ఎలా సోకిందో గుర్తిస్తామని ఆయన చెప్పారు.  కరోనా వస్తే చనిపోతామనే భయం వద్దని ఆయన చెప్పారు. 

click me!