ఆన్‌లైన్ గేమ్స్‌తో వివాహిత అప్పుల పాలు.. ఇద్దరు పిల్లలను సంపులో వేసి.. ఆ తర్వాత ..  

Published : Jun 28, 2023, 07:36 AM IST
ఆన్‌లైన్ గేమ్స్‌తో వివాహిత అప్పుల పాలు.. ఇద్దరు పిల్లలను సంపులో వేసి.. ఆ తర్వాత ..  

సారాంశం

ఆన్‌లైన్‌ గేమ్‌ అనే మాయదారి వలలో పడి ఓ వివాహిత అప్పుల పాలైంది. ఆ అప్పులను తీర్చలేక ఇద్దరు పిల్లలను సంపులో వేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ అనే వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. సరదాగా మొదలైన ఆన్‌లైన్‌ గేమ్స్‌  అలవాటుగా మారి ఆపై వ్యసనంలా మారుతున్నాయి.  చివరకు ప్రాణాలను తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ గేమ్‌ మాయలో పడిన ఓ వివాహిత పీకలలోతు అప్పుల పాలైంది. ఆ అప్పులను తీర్చలేక తన ఇద్దరు పిల్లలను సంపులో వేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్‌ లారీ డ్రైవర్‌ గా జీవనం సాగిస్తున్నాడు. అతని తన భార్య రాజేశ్వరి(28). వారికి ఇద్దరు కుమారులు.. అనిరుధ్‌(5), హర్షవర్ధన్‌(3). మల్లేష్ తన భార్య, పిల్లలతో కలిసి కొన్నేళ్లుగా చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరి ఆన్లైన్ గేమ్స్ కి బానిసగా మారిపోయింది. ఎంతగా అంటే.. ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుతూ ఏకంగా రూ.8లక్షలు పోగొట్టుకుంది. పైగా ఆ డబ్బు తనది కూడా కాదు..  తెలిసిన వ్యక్తులు, బంధువులది. వారి నుంచి అప్పుగా తీసుకుని మరీ ఆన్లైన్ గేమ్ ఆడింది. 

ఈ క్రమంలో అప్పు  తీర్చమని అప్పు ఇచ్చిన వ్యక్తి  మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి నిలదీశారు. తన ఇంటిస్థలం అమ్మి, బాకీ తీర్చుతామని నచ్చచెప్పినా ఆయన వినలేదు. ఈ తరుణంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.  ఈ ఘటనతో తన పరువు పోయిందని, చేసిన అప్పులను తాను తీర్చలేనని భావించిన రాజేశ్వరి దారుణానికి పాల్పడింది. ఇంట్లో తన భార్త లేని సమయంలో  తన ఇద్దరు కుమారులను ఇంటి ఆవరణలో ఉన్న నీటిసంపులో వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది.

రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన మల్లేశ్ కు భార్యాపిల్లలు కనిపించలేదు. ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. కానీ ఫలితం లేదు. ఎందుకో అనుమానం వచ్చి.. సంపు మూత తెరిచి చూస్తే.. దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే ముగ్గురినీ బయటికి తీసి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు