
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీ అనంతరం వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌ను కాంగ్రెస్ సిద్ధం చేసిందన్నారు. సర్వేల ఆధారంగానే ఈసారి టికెట్ల కేటాయింపు వుంటుందని, క్లారిటీ వచ్చిన స్థానాలకు సంబంధించి వచ్చే నెలలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం వుందని కోమటిరెడ్డి తెలిపారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్ధితుల్లోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని ఆయన స్పష్టం చేశారు. జనరల్ స్టానాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని రాహుల్ గాంధీని కోరానని వెంకట్ రెడ్డి తెలిపారు. అలాగే ఎప్పడు రమ్మంటే అప్పుడు తెలంగాణకు వస్తానని రాహుల్ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి వెల్లడించారు. కేసీఆర్ అవినీతి లెక్కలన్నీ బయటకు తీయాలని, ఆయన కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఇక తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గురించి తనకు తెలియదని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దెదించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల టార్గెట్‌గానే సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిస్థితులపై ఫోకస్ చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఏఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది చర్చించడం జరిగిందని చెప్పారు.
ఎన్నికలకు సిద్దం కావాలని రాహుల్ గాంధీ ఆదేశించారని తెలిపారు. విభేదాలు వీడి ఎకతాటిపైకి వచ్చి పనిచేయాలని సూచించారని చెప్పారు. సమావేశంలో ప్రతి నేతతో మాట్లాడారని.. సలహాలు స్వీకరించడంతో పాటు సూచనలు చేశారని తెలిపారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరుకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఆశించిన విధంగా జరగడం లేదని అన్నారు.