నమ్మితే.. నట్టేట ముంచాడు.. ఇన్ స్టాగ్రామ్ లవ్ ఆస్ట్రాలజర్ పేరుతో లేడీ టెక్కీకి రూ.47లక్షలు టోకరా...

By SumaBala BukkaFirst Published Dec 6, 2022, 8:59 AM IST
Highlights

లవ్ ఆస్ట్రాలజర్ పేరుతో రూ. 47 లక్షలకు టోకరా వేసిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పంజాబ్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. 

హైదరాబాద్ : ఓ యువతి ఇన్స్టాగ్రామ్ లో లవ్ ఆస్ట్రాలజర్ ను  నమ్మింది. తన వ్యక్తిగత సమస్యలు చెప్పుకుంది. దీంతో అతడు ఆమెను నిండా ముంచాడు. ఆ యువతి నుంచి రూ. 47 లక్షలు కాజేశాడు. ఈ ఘరానా కేటుగాడిని పోలీసులు పంజాబ్లోని మొహాలీలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి నగరానికి తరలించారు. అతడి పేరు లలిత్.. కానీ, సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ లో గోపాల్  శాస్త్రి పేరుతో లవ్ ఆస్ట్రాలజర్ ప్రకటనలు ఇచ్చేవాడు. అది నమ్మి, తనను సంప్రదించిన వారిని  మోసం చేస్తున్నాడు. ఈ మేరకు సోమవారం ఈ వివరాలను జాయింట్ సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ ప్రకటించారు.

పంజాబ్ కు చెందిన గోపాల్ శాస్త్రి అలియాస్ లలిత్ తండ్రి గోపాల్ చాంద్. అతను జ్యోతిష్కుడు. లలిత్ తండ్రి నుంచి జ్యోతిష్యం విద్య నేర్చుకుని.. వారసత్వంగా దానినే వృత్తిగా చేపట్టాడు. ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి…తాను కూడా దాన్నే ఫాలో అవ్వాలనుకున్నాడు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం  ఇంస్టాగ్రామ్ లో  అకౌంటు తెరిచాడు. లలిత్ ఆన్లైన్ జ్యోతిష్యం అంటూ గూగుల్,  యూట్యూబ్ లలో విపరీతంగా ప్రచారం చేశాడు.

రైతులను వ్యవసాయ కూలీలుగా చేసేందుకు కేసీఆర్ కుట్ర.. : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతి యాడ్ ను చూసింది. పూజలు, జాతకాలు అంటే ఆమెకు బాగా నమ్మకం. దీంతో ఇటీవలికాలంలో తనకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం వెతుకుతోంది.  ఈ క్రమంలోనే ఆమె లలిత్ ఆన్లైన్ జ్యోతిష్యం యాడ్ చూసింది. అది ఆమెను విపరీతంగా ఆకర్షించింది. దీంతో  ఓ ప్రకటనలో ఇచ్చిన  నెంబర్ తో  గోపాల్ శాస్త్రిని సంప్రదించింది. తానొక వ్యక్తిగత సమస్యలో ఇరుక్కున్న అని గోపాల్ శాస్త్రి అలియాస్ లలిత్ కి చెప్పుకుంది. అదంతా విన్న అతను  సమస్యను  పరిష్కరించవచ్చని నమ్మకం కలిగించాడు.

ఆమె తనను ఎంతవరకు నమ్ముతుందో గమనించిన తర్వాత.. కొద్ది రోజులు ఆమె జాతకాన్ని పరిశీలిస్తున్నట్లు, సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తున్నట్లుగా  బిల్డప్ ఇచ్చాడు. జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని.. వీటికి నివారణ పూజలు చేస్తే సరిపోతుందని నమ్మించాడు. దీనికోసం తొలుత రూ.32వేలు ఖర్చు అవుతుందని  చెప్పి ఆ డబ్బులు పంపించాలని కోరాడు. ఆమె ఆ డబ్బులు వెంటనే పంపించింది. అయితే ఈ బురిడీ బాబా ఇక్కడితో ఆగలేదు. రకరకాల పూజలు, దోష నివారణ చర్యల పేరుతో పలు దఫాలుగా ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి రూ. చి47.11లక్షలు రాబట్టాడు.

అప్పటికి కానీ తాను మోసపోయానని అర్థంకాని యువతి.. ఆ తర్వాత సిటీ సైబర్ క్రైం ఏసీపీప్రసాద్ ను కలిసింది. తాను మోసపోయిన విషయాన్ని ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఏసీపీ ఆదేశాలతో లలిత్ పై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ కె. హరి భూషణ్ రావు నేతృత్వంలోని పోలీసుల బృందం దర్యాప్తు చేపట్టింది. గోపాల్ శాస్త్రి అలియాస్ లలితను మొహాలీలో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని పీటీ వారెంట్ పై సిటీకి తీసుకువచ్చారు. గతంలో పాతబస్తీకి చెందిన ఓ మహిళ కూడా ఇదే రీతిలో నాలుగు లక్షలు పోగొట్టుకుంది. ఆ నేరంలో ఇతడి ప్రమేయం ఉందా అనే దిశగా ఆరా తీస్తున్నారు. 

click me!