అధిష్టానం ఫార్ములా: జానా సహా సీనియర్ నేతలకు షాక్

By pratap reddyFirst Published Nov 9, 2018, 8:32 AM IST
Highlights

ఒన్ ఫ్యామిలీ ఒన్ టికెట్ అనే ఫార్ములాను ముందుకు తేవడం ద్వారా కాంగ్రెసు అధిష్టానం తమ వారసులను రాజకీయాల్లోకి తేవాలనే పలువురు నేతల ప్రయత్నాలకు గండి కొట్టింది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పటికీ జానా రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు.

హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఒక కుటుంబంలోంచి ఒకరికే టికెట్ ఇవ్వాలనే పార్టీ అధిష్టానం ఫార్ములా తెలంగాణ సీనియర్ కాంగ్రెసు నేతలకు పలువురికి షాక్ ఇచ్చింది. ఒన్ ఫ్యామిలీ ఒన్ టికెట్ అనే ఫార్ములాను ముందుకు తేవడం ద్వారా కాంగ్రెసు అధిష్టానం తమ వారసులను రాజకీయాల్లోకి తేవాలనే పలువురు నేతల ప్రయత్నాలకు గండి కొట్టింది. 

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పటికీ జానా రెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. జానారెడ్డి నాగార్జునసాగర్ సీటు నుంచి పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డికి మిర్యాలగుడా సీటు కావాలని అడిగారు. ఓ సమయంలో నాగార్జున సాగర్ లో తన కుమారుడిని పోటీకి దించి తాను మిర్యాలగుడా నుంచి పోటీ చేయాలని కూడా ఆయన ఓ సమయంలో అనుకున్నారు. 

గద్వాల నుంచి పోటీ చేస్తున్న డికె అరుణ తన కూతురు స్నిగ్ధా రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఆశించారు. జహీరాబాద్ నుంచి పోటీ చేయనున్న మాజీ మంత్రి గీతా రెడ్డి తన కూతురు మెఘనా రెడ్డికి మెదక్ సీటు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. 

భూపాలపల్లి నుంచి పోటీ చేయనున్న గండ్ర వెంకటరమణా రెడ్డి తన భార్య జ్యోతికి టికెట్ అడిగారు. పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి పోటీ చేయనుండగా తన కోడలికి టికెట్ ఆశించారు. మహేశ్వరం నుంచి పోటీ చేయనున్న సబితా ఇంద్రా రెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డికి రాజేంద్ర నగర్ సీటు అడిగారు. 

మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తన భార్యకు సంగారెడ్డి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుటుంబాన్ని మాత్రం అధిష్టానం ఆ ఫార్ములా నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. 

అలాగే, నల్లగొండ నుంచి పోటీ చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయి. మల్లుభట్టి విక్రమార్క మథిర నుంచి పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేయనున్నారు. 

click me!