పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. ఒకరి దుర్మరణం.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

By Rajesh KarampooriFirst Published Jan 25, 2023, 1:45 AM IST
Highlights

జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించిన కొండగట్టు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బైక్స్ పై పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతూ వచ్చిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యాగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

జనసేనాని పవన్ కల్యాణ్ నిర్వహించిన పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బైక్స్ పై ఆయన కాన్వాయ్ ను ఫాలో అవుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాని ప్రమాదశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పవన్ కాన్వాయ్ వెనుక వెళ్తున్న అభిమాని బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పవన్ అభిమాని అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో మరో ముగ్గురికి తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన  వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట స్టేజ్ దగ్గర చోటు చేసుకుంది.  

వివరాల్లోకెళ్తే.. పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజ చేయించారు.  అనంతరం ధర్మపురి మీదుగా హైదరాబాద్ కు తిరిగి వస్తోన్న సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు ఆయన కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. జనసేన జెండాలు ఊపుతూ.. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన కాన్వాయ్ వెంటేనే  ప్రయాణించారు. అంతా బాగానే ఉందనే సమయంలో జగిత్యాల జిల్లా లోని  వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట స్టేజ్ వద్ద బైక్స్ అదుపు తప్పి ఢీ కొట్టాయి. దీనితో నలుగురు యువకులు కింద పడ్డారు. 

ఈ ఘటనలో  తీవ్ర గాయాలపాలైన రాజ్ కుమార్ అనే యువకుడు స్పాట్ లోనే మృతి చెందాడు. అంజి, శ్రీనివాస్, సాగర్ ఈ ముగ్గురూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. వారికి ప్రాణాపాయం తప్పిందని  సమాచారం. పవన్ కల్యాణ్ పై తమ అభిమానం చాటుకునేందుకు వచ్చి రాజ్ కుమార్ చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. రాజ్ కుమార్ ఇంట్లో విషాదం అలుముకున్నాయి.

మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లారు. అక్కడి ఆంజనేయ స్వామివారి గుడిలో వారాహి వాహనానికి పూజలు చేయించారు. అనంతరం ధర్మపురిలో  లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. తన పర్యటనలో చోటు చేసుకున్న ప్రమాదం పట్ల పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.

click me!