Dansari Anasuya Seethakka: ములుగు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానసరి సీతక్క తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు.
Seethakka: తుపాకీ చేత పట్టుకుని మావోయిస్టు పోరాటం సాగించిన ప్రయాణం నుంచి న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా ఎదిగారు సీతక్కగా ప్రసిద్ది చెందిన దానసరి ఆనసూయ సీతక్క. ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన క్రమంలో ఆమె వేదికపైకి వెళ్తుండగా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయమని సంకేతాలు ఇచ్చేలోపే ఆమె కాసేపు ఆగి చేతులు జోడించి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం తర్వాత తనను సోదరిలా భావించే రేవంత్ రెడ్డితో కరచాలనం చేశారు.
అనంతరం సీతక్క కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీల వద్దకు వెళ్లి వారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. సోనియా గాంధీ లేచి నిలబడి ఆమెను కౌగిలించుకుని అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కరచాలనం చేశారు. ఈ క్షణాలు చూసిన చాలా మంది గిరిజన బిడ్డలు భావోద్వేగానికి గురయ్యారని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన ములుగు నియోజకవర్గం నుంచి 52 ఏళ్ల సీతక్క మూడో సారి తిరిగి ఎన్నికయ్యారు.
Latest Videos
undefined
ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని సంపాదించడం నా అలవాటు. నా చివరి శ్వాస వరకు ఈ పని చేయడం ఆపను : మినిస్టర్ సీతక్క
తుపాకి చేతపట్టి..
కోయ తెగకు చెందిన సీతక్క చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరి అదే గిరిజన ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న సాయుధ దళానికి నేతృత్వం వహించారు. పోలీసులతో పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్న ఆమె.. ఎన్ కౌంటర్లలో భర్త, సోదరుడిని కోల్పోయింది. ఉద్యమంతో విసిగిపోయిన ఆమె 1994లో సాధారణ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయింది.
విద్యాను కొనసాగించి.. న్యాయవాదిగా మారి..
మావోయిస్టుగా పోలీసులకు లొంగిపోయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో చదువును కొనసాగించాలనే నిర్ణయంతో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన సీతక్క జీవితం కొత్త మలుపు తిరిగింది. వరంగల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. పేద ప్రజలకు అండగా ఉన్నారు.
రాజకీయాల్లో కొత్త ఒరవడి..
న్యాయవాదిగా ముందుకు సాగుతున్న క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో ములుగు నుంచి పోటీ చేశారు. కానీ, కాంగ్రెస్ వేవ్ ను ఎదుర్కొని ఆమె రన్నరప్ గా నిలిచారు. అయితే, 2009 ఎన్నికల్లో ఆమె అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. 2017 లో ఆమె టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరారు. 2018 లో సీటును గెలుచుకోవడం ద్వారా బలమైన పునరాగమనం చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో తన మానవతా కొనసాగింపు చర్యలు, ప్రజలకు అండగా నిలబడిన తీరుతో ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యావసరాల భారాన్ని భుజాలపై మోస్తూ అడవులు, ముళ్లపొదలును కూడా లెక్కచేయకుంగా వాగులు వంకలు దాటుతూ లాక్డౌన్ సమయంలో అటవీ ప్రాంతంలోని తన ప్రజలను సాయం చేశారు. ప్రజల్లో ఉంటూ నిజమైన ప్రజా నాయకురాలిగా పేరు సంపాదించడంతో 2023 తెలంగాణ ఎన్నికల్లో మరోసారి ములుగు ప్రజలు సీతక్కకు పట్టంకట్టారు.
1980వ దశకం చివరి.. 1990వ దశకం ప్రారంభంలో తుపాకీతో మావోయిస్టు తిరుగుబాటుదారుగా అదే అడవిలో కార్యకలాపాలు సాగించారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె జీవితంలో తేడాలు గమనిస్తే.. ఒక మావోయిస్టుగా చేతిలో తుపాకీ పట్టుకుని అణచివేతకు గురైన ప్రజల కోసం పోరాటం సాగించారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత తుపాకి బదులు తన ప్రజలను ఆదుకోవడం కోసం ఆహారం, ఇతర నిత్యావసర సరుకులను భూజంపై మోసుకెళ్లింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
చదువులను కొనసాగిస్తూనే..
గతేడాది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్సెస్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వలస గిరిజనుల సామాజిక బహిష్కరణ, అణచివేత - వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొట్టి కోయ తెగల కేస్ స్టడీలో గిరిజన ఎమ్మెల్యే సీతక్క పీహెచ్ డీ చేశారు. తన చిన్నతనంలో తాను నక్సలైట్ అవుతానని అనుకోలేదనీ, నక్సలైట్ అయినప్పుడు లాయర్ అవుతానని అనుకోలేదని, న్యాయవాదిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదని చెప్పారు. అలాగే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్ డీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. "ఇప్పుడు మీరు నన్ను పొలిటికల్ సైన్స్ లో డాక్టర్ అనసూయ సీతక్క పీహెచ్ డీ అని పిలవొచ్చునని" తన పీహెచ్ డీ పూర్తి చేసిన అనంతరం సీతక్క ట్వీట్ చేశారు. సాధారణ గిరిజన బిడ్డ నుంచి ఇప్పుడు తెలంగాణ మంత్రి వరకు ఆమె ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శవంతం.. స్ఫూర్తిదాయకం.. !